Begin typing your search above and press return to search.

సొంత జిల్లాలోనే బాబుకు ఓటమి?

By:  Tupaki Desk   |   22 March 2017 4:50 AM GMT
సొంత జిల్లాలోనే బాబుకు ఓటమి?
X
తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చాయని చెప్పాలి. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల గెలుపు మీద పెట్టిన ‘‘ఫోకస్’’ మిగిలిన.. ఉపాధ్యాయ.. పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికలపై పెట్టకపోవటంతో భారీ మూల్యాన్ని చెల్లించక తప్పని పరిస్థితి. 2019లో జరిగే ఎన్నికల్లోనే కాదు.. భవిష్యత్తులు వచ్చే అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ మాత్రమే గెలుపొందాలన్న అత్యాశ మాటలు చెప్పిన చంద్రబాబుకు ఇరవై నాలుగు గంటలకే భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిన దుస్థితి.

దీంతో.. తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించకుండా బాబు ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది. స్థానిక సంస్థలకుజరిగిన మూడు స్థానాల్లో విజయం సాధించినా.. పట్టభద్రులు.. ఉపాధ్యాయ స్థానాలకు జరిన ఐదు ఎన్నికల్లో నాలుగింటిలో టీడీపీ ఓడిపోవటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నింటికి మించి పవర్ లో ఉండి కూడా.. సీఎం తన సొంత జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి పాలు కావటం భారీ షాక్ గా మారింది.

సీఎం సొంత జిల్లాలో బరిలో నిలిపిన అధికారపార్టీ అభ్యర్థి ఓటమి.. అధికారపక్షంలో కొత్త గుబులు రేపుతోంది. చిత్తూరు..నెల్లూరు.. ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం చేతిలో టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు ఓటమిపాలయ్యారు.

అంతేకాదు.. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరుకు జరిగిన మరో ఎమ్మెల్సీ ఎన్నిక (పట్టభద్రుల స్థానం)లోనూ టీడీపీ ఓటమిపాలు కావటం గమనార్హం. పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి3500 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఓటమి పాలయ్యారు. సీఎం ప్రాతినిధ్యం వహించే జిల్లాకు చెందిన రెండు ఎన్నికల్లోనూ అధికారపక్షం ఓడిపోవటం టీడీపీ వర్గాలకు షాకింగ్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/