Begin typing your search above and press return to search.

గిడ్డి దెబ్బ‌కు బెంబేలెత్తిపోయిన వంగ‌ల‌పూడి!

By:  Tupaki Desk   |   21 March 2017 6:21 AM GMT
గిడ్డి దెబ్బ‌కు బెంబేలెత్తిపోయిన వంగ‌ల‌పూడి!
X
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా కాసేప‌టి క్రితం ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. టీడీపీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందంటూ వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి చేసిన వాద‌న‌కు అధికార ప‌క్షం నుంచి స‌రైన స‌మాధానం వ‌చ్చిన దాఖ‌లానే క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో ఎదురు దాడినే న‌మ్ముకున్న అధికార ప‌క్షం త‌న తురుపు ముక్క వంగ‌ల‌పూడి అనిత‌ - చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ ల‌ను రంగంలోకి దించ‌గా, అసెంబ్లీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. త‌మ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా... ఎదురుదాడినే న‌మ్ముకున్న టీడీపీ తీరుపై విప‌క్షం నిర‌స‌న‌కు దిగింది. ఈ క్ర‌మంలో విప‌క్ష ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్ట‌గా... స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ ప‌రిధిలోని మీడియా పాయింట్ వ‌ద్ద‌కు కాస్తంత ఆల‌స్యంగా చేరుకున్న గిడ్డి ఈశ్వ‌రి - మిగిలిన వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధ‌ప‌డ్డారు.

అయితే అప్ప‌టికే అక్క‌డ‌కు వ‌చ్చిన టీడీపీ ఎమ్మెల్యే వంగ‌లపూడి అనిత‌... త‌న‌తో పాటు వ‌చ్చిన టీడీపీ మ‌హిళా ఎమ్మెల్యే మాట్లాడుతుండ‌గా ప‌క్క‌నే నిల‌బ‌డ్డారు. ఆ ఎమ్మెల్యే మాట్లాడ‌టం ముగియ‌గానే గిడ్డి ఈశ్వ‌రి రంగంలోకి దిగారు. మీరు మాట్లాడారుగా... మేమూ మాట్లాడ‌తామంటూ ముందుకు వ‌చ్చారు. అయితే తాము మాట్లాడేది ఇంకా అయిపోలేద‌ని అనిత వాదించారు. అంతేకాకుండా త‌మ‌ వాద‌న వినిపించ‌కుండా చేస్తున్నార‌ని గిడ్డి ఈశ్వ‌రి ఒక్క‌సారిగా ఆగ్ర‌హావేశానికి గుర‌య్యారు. అనిత‌తో వాదిస్తూనే... స‌భ లోప‌లే కాకుండా స‌భ బ‌య‌ట కూడా త‌మ వాద‌నను వినిపించ‌కుండా చేస్తారా? అంటూ ఆమె ఓ రేంజిలో ఫైర‌య్యారు. ఈ క్ర‌మంలో గిడ్డి - వంగ‌ల‌పూడి మ‌ధ్య ఆస‌క్తికర వాగ్వాదం చోటుచేసుకుంది.

సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబునే త‌ల తీస్తానంటూ గిడ్డి వ్యాఖ్యానించారంటూ అనిత కొత్త ఆరోప‌ణ చేశారు. అయితే ఈ వాద‌న‌కు గిడ్డి చాలా వేగంగా స్పందించారు. చంద్ర‌బాబు త‌ల న‌రుకుతానంటూ తాను అన‌లేద‌ని, అలా అన్నాన‌ని నిరూపిస్తే... త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని, రాజకీయాల నుంచి కూడా త‌ప్పుకుంటానంటూ గిడ్డి స‌వాల్ విసిరారు. గిడ్డి స‌వాల్‌ తో వంగ‌ల‌పూడి నోట మాట రాలేదు. అంతేకాకుండా అస‌లు గిడ్డి ఈశ్వ‌రి అడిగిన ఏ ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం చెప్ప‌లేని స్థితిలో అనిత కూరుకుపోయారు. అయినా కూడా మీడియా పాయింట్ నుంచి త‌ప్పుకునేందుకు నిరాక‌రించిన అనిత‌... గిడ్డి మాట్లాడుతున్నా... అక్క‌డే నిల‌బ‌డిపోయారు. ఈ క్ర‌మంలో అక్క‌డ యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అప్ప‌టికే అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఇరువ‌ర్గాల‌ను వారించేందుకు య‌త్నించారు.

అయితే విప‌క్ష హోదాలో ఉన్న గిడ్డినే అనిత అడ్డుకున్నార‌న్న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు అనిత వెన‌క్కు చేరుకున్నారు. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన ఆదేశాలో, ఏమో తెలియ‌దు గానీ... అక్క‌డి నుంచి త‌క్ష‌ణ‌మే వెళ్లిపోవాల‌ని ఆమెకు చెవిలో చెప్పారు. దీంతో చేసేదేమి లేక వంగ‌ల‌పూడి అక్క‌డి నుంచి తుర్రుమ‌న‌క త‌ప్ప‌లేదు. అయితే ఆ త‌ర్వాత టీడీపీ పురుష ఎమ్మెల్యేలు వెంట రాగా... అనిత మ‌ళ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అప్ప‌టికి కూడా గిడ్డి ఇంకా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. ప‌రిస్థితి చేయిదాటిపోతోంద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన అనిత‌... గిడ్డి అక్క‌డి నుంచి నిష్క్ర‌మించే దాకా సైలెంట్‌ గానే ఉండిపోవాల్సి వ‌చ్చింది. గిడ్డి ఈశ్వ‌రి అక్క‌డి నుంచి వెళ్లిన త‌ర్వాత మైకందుకున్న అనిత‌... వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేలే త‌మ‌పై దౌర్జన్యం చేశార‌ని ఆరోపించారు. అయితే గిడ్డి విసిరిన స‌వాల్‌ కు మాత్రం అనిత నుంచి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/