ఏపీలో 80 ప్లస్ పోలింగ్ ఏ పార్టీని గెలిపించనుంది?

Fri Apr 12 2019 10:47:07 GMT+0530 (IST)

ఏపీలో పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత ప్రతిష్ఠాత్మకంగా అధికార.. విపక్ష పార్టీలు ఎన్నికల కోసం సిద్ధం కావటం తెలిసిందే. డూ ఆర్ డై అన్నట్లుగా రెండు ప్రధాన పార్టీలు వ్యవహరించటం అరుదు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న విషయంలో.. టీడీపీ.. జగన్ పార్టీలు రెండూ తమవంటే.. తమవన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది.ఈ రెండు పార్టీలు గెలుపునకు 80 శాతానికి పైగా పోలింగ్ జరగటం కారణాన్ని చూపిస్తున్నాయి. అత్యధిక పోలింగ్ జరగటం అధికారపక్షానికి చేటు చేసే సంకేతమని జగన్ పార్టీ చెబుతుంటే.. మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని చూసిన తర్వాత కూడా ఇలాంటి వాదనను వినిపిస్తారా? అంటూ టీడీపీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి.

తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని టీడీపీ నమ్మకంగా చెబుతుంటే.. ప్రభుత్వ వైఫల్యం.. బాబు మీద ఉన్న వ్యతిరేకత తమను విజయతీరాలకు చేర్చటం ఖాయమన్న ధీమాను జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఈవీఎంలలో లోపాలు వెల్లువెత్తినా.. అర్థరాత్రి వరకూ ఓపిగ్గా వెయిట్ చేసి మరీ ఓట్లు వేసిన ఓటర్లే తమను గెలిపిస్తారన్న మాటను రెండు పార్టీల నేతలు నమ్మకంగా చెబుతున్నారు. ఎన్నికల్లో విజయానికి తమకున్న అవకాశాలపై ప్రధాన పార్టీలకు చెందిన వారు వినిపిస్తున్న వాదనల్ని చూస్తే..

జగన్ పార్టీ అంచనాలు

%  80 ప్లస్ శాతం పోలింగ్ కావటం. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఇది సాధ్యం
%  జగన్ పాదయాత్ర
%  ఏపీ ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకోవటం
%  బాబు సర్కారులో నెలకొన్న అవినీతి
%  జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పేంటి?
%  టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత
%  ప్రత్యేక హోదాపై మొదట్నించి ఒకే మాట మీద నిలవటం
%  హైదరాబాద్.. తమిళనాడు.. కర్ణాటకల నుంచి వచ్చిన ఓటర్లలలో అత్యధిక ఓట్లు

టీడీపీ అంచనాలు..

%  జగన్ గెలిస్తే ఏపీ రాజధాని.. డెవలప్ మెంట్ యాక్టివిటీస్ ఆగిపోతాయి
%  జగన్ మైండ్ సెట్ సరిగా లేదు
%  అనుభవం ఉన్న బాబు చేతుల్లోనే ఏపీ సురక్షితం
%  ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు
%  ఏపీకి ఉమ్మడి శత్రువులైన మోడీ.. కేసీఆర్ లతో జగన్ జట్టు కట్టటం
%  జగన్ రాకూడదనే పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది
%  హైదరాబాద్.. తమిళనాడు.. కర్ణాటకలో ఉన్న వారు ఓటింగ్ కు రావటం బాబును గెలిపించేందుకే
%  నన్ను చూసి ఓట్లు వేయాలంటూ బాబు చేసిన వినతి