Begin typing your search above and press return to search.

టీడీపీ-బీజేపీ విమ‌ర్శ‌లు ప్లాన్‌ లో భాగ‌మేనా?

By:  Tupaki Desk   |   23 May 2016 5:30 PM GMT
టీడీపీ-బీజేపీ విమ‌ర్శ‌లు ప్లాన్‌ లో భాగ‌మేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ అంశాల అమలులో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాష్ట్రానికి మొండిచేయి ఎదురుకావడంతో జ‌రుగుతున్న పరిణామాల‌పై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. తెలుగుదేశం-బీజేపీ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తున్నా ప్రజాగ్రహాన్ని పక్కదోవ పట్టించడానికే రెండుపార్టీలూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇదంతా ఇరు పార్టీల మైండ్‌ గేమ్‌ లో భాగ‌మ‌ని కూడా ప‌లువురు రాజ‌కీయవేత్త‌లు విశ్లేషిస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా ఇస్తున్న‌ట్లే ఊరించిన కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల త‌న అస‌లు వైఖ‌రిని బ‌య‌ట‌పెట్టింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని పార్ల‌మెంటు సాక్షిగా కేంద్ర‌మంత్రి - తెలుగు గ‌డ్డ‌పై బీజేపీ వ్య‌వ‌హారాల ఇంచార్జీ తేల్చిచెప్పారు. అయితే హోదా విష‌యంలో త‌మ ప్ర‌య‌త్నం కొనసాగిస్తామ‌ని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత సీన్ మారింది. ప్రత్యేకహోదా విషయంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఏం చెప్పార‌నే విష‌యంలో చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అదే స‌మ‌యంలో హోదాపై రాజీ లేదని అంటూనే, స్పెష‌ల్ స్టేట‌స్ ద‌క్కిన ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయ‌ని ప్ర‌శ్నిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉంటే క్షేత్ర‌స్థాయిలో మాత్రం బీజేపీ-టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం వ్య‌తిరేక‌త‌ను దూరం చేసుకునేందుకేన‌ని అంటున్నారు. ప్ర‌త్యేక హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తాం అంటూ ఢిల్లీలో మీడియా ప్రతినిధులను సీఎం చంద్ర‌బాబు ప్రశ్నించిన త‌ర్వాత వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను దూరం చేసేందుకు ఇలా ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల ప‌ర్వానికి దిగార‌ని ఏపీ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఈ విమ‌ర్శ‌లను ఇరుప‌క్షాలు నిజంగా చేసుకొని ఉంటే...ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌ప‌డేవార‌ని, ఏపీకి ఏం చేశామో బీజేపీ లెక్క‌లు బ‌య‌ట‌పెట్టేద‌ని చెప్తున్నారు. అలా చేయ‌క‌పోవ‌డ‌మంటేనే అంత‌ర్గ‌తంగా అంతా ఓకే అనే భావ‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేషిస్తున్నారు.