Begin typing your search above and press return to search.

తెలంగాణలో తేలితే..ఏపీలో మునుగుతారు

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:17 AM GMT
తెలంగాణలో తేలితే..ఏపీలో మునుగుతారు
X
కొన్ని రాష్ట్రాల్లో పార్టీ శాఖలు పెట్టి జాతీయ పార్టీగా మారిపోయిన తెలుగుదేశానికి ఇది గడ్డు పరిస్థితిగానే ఉంది. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు కాంగ్రెస్ - ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమికి జాతీయ పార్టీ కాంగ్రెస్ నేతృత్వం వహించడం విశేషం. సమైక్య రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం తెలుగుదేశం వర్గాల్లో కొందరికి రుచించడం లేదు. అయితే వారిని బుజ్జగించడం చంద్రబాబు నాయుడికి తేలికే అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ అపవిత్ర కలయికను ఎలా తెలియజేయాలో మాత్రం ఓ పట్టాన అర్థం కావ‌డం లేదు బాబుకి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. తమ ఆశల్ని - కలల్ని - భవిష్యత్ ని చిదిమేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపితే బాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో ప్రజాప్రయోజనాల పేరుతో తమను వంచించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని ఏపీ ప్రజలు అంగీకరించరని విశ్లేషకుల భావన.

తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంతో సానుభూతి ఉందని - వారితో కలిసినా తెలుగుదేశం పార్టీ పట్ల ఆంధ్రులకు మంచి గౌరవం వచ్చేదని అంటున్నారు. దీనిని గ్రహించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితితో కలవాలని భావించారని - ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ప్రకటించారని అంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీతో ఉన్న తన వ్యక్తిగత వైరాన్ని తీర్చుకుందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారనే వాదనలు వస్తున్నాయి. మహాకూటమి వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచి జరిగినా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై మాత్రం తీవ్రంగా పడుతుందని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తుందని చెబుతున్నా ఆ పార్టీని విశ్వసించే అవకాశాలు లేవంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగులుతుందని విశ్లేషకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్‌ లో వ్యతిరేకత వస్తోందని - దీనికి తోడు మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌ తో చేతులు కలిపితే మరింత నష్టం వస్తుందని అంటున్నారు. శాసనసభ్యులు - మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ప్రత్యక్షంగానే కనిపిస్తోందని - చాలా చోట్ల వారిని మారిస్తే తప్ప పార్టీకి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం ఆత్మాహత్యవంటిదేనని రాజకీయ పండితులు అంటున్నారు.