Begin typing your search above and press return to search.

మంత్రిపదవి రాలేదు.. పద్మారావు మనస్తాపం

By:  Tupaki Desk   |   19 Feb 2019 4:42 AM GMT
మంత్రిపదవి రాలేదు.. పద్మారావు మనస్తాపం
X
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వేళయ్యింది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు మంత్రులుగా 10మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే రెండు నెలలుగా కసరత్తు చేసిన కేసీఆర్ ఈసారి పోయిన సారి చేసిన నలుగురికి మాత్రమే తొలి విస్తరణలో అవకాశం కల్పించారు. తలసాని - అల్లోల - ఈటల - జగదీశ్ రెడ్డిలు రెండో సారి మంత్రులయ్యారు.

ఇక కీలకమైన హైదరాబాద్ నుంచి ఈసారి తలసాని శ్రీనివాసయాదవ్ ఒక్కరే మంత్రి పదవి చేపట్టడం గమనార్హం. పోయినసారి హైదరాబాద్ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. నాయిని నర్సింహారెడ్డి - పద్మారావు - తలసాని లు మంత్రులయ్యారు. ఈసారి మాత్రం నాయిని - పద్మారావులకు మొండి చేయి ఎదురైంది.

హైదరాబాద్ జిల్లా నుంచి కొత్త కేబినెట్ లో తలసానితో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి అందరూ ఆశించిన పట్నం నరేందర్ రెడ్డికి కాకుండా చివరి నిమిషంలో మేడ్చల్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డికి అనూహ్యంగా కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.

కాగా రాష్ట్ర కేబినెట్ లో తనకు చోటు దక్కలేదని తెలిసి సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న తనకు కాకుండా టీడీపీ అభ్యర్థిగా తనతో పలుమార్లు తలపడిన శ్రీనివాసయాదవ్ కు స్థానం కల్పించడంపై పద్మారావు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తలసానికి మంత్రి పదవి ఇవ్వడంపై తనకు అభ్యంతరం లేదని.. అదే సమయంలో తనకు కూడా ఇస్తే సరైన గౌరవం ఉంటుందని పద్మారావు పార్టీ ముఖ్యనేతల వద్ద వాపోయినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ అసంతృప్తి టీఆర్ ఎస్ లో ఎటు దారితీస్తుందనేది వేచిచూడాలి.

కాగా పద్మారావుకు కేబినెట్ ర్యాంకు గల తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని సమాచారం.