Begin typing your search above and press return to search.

సారీ చెప్పని ఒబామాది పెద్ద మనసా?

By:  Tupaki Desk   |   28 May 2016 6:07 AM GMT
సారీ చెప్పని ఒబామాది పెద్ద మనసా?
X
అమెరికా అహంకారం గురించి తరచూ పలువురు ప్రస్తావిస్తుంటారు. అగ్రరాజ్యాన్ని అమితంగా ఆరాధించే వారు ఎంతమందో.. దాని బలుపును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేటోళ్లు కూడా భారీగానే కనిపిస్తారు. ప్రపంచానికి పెద్దన్న మాదిరిగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు పైకి ఎంత సౌమ్యంగా కనిపించినా.. తన విశాల హృదయాన్ని చాటినట్లుగా కనిపించినా.. అదంతా నటనే తప్ప నిజం కాదన్న విషయం తరచూ స్పష్టమవుతూనే ఉంటుంది.

ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన నేతల్లో విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్న అధినేతగా పేరొందిన బరాక్ ఒబామా కూడా అహంకార రాజ్యాధినేత అన్న విషయాన్ని ఎవరు అవునన్నా.. కాదన్నా ఒప్పుకోవాల్సిందే. ప్రపంచ చరిత్రలో తొలి అణుబాంబు ప్రయోగంతో లక్షలాది ప్రజల ప్రాణాల్ని తీసిన అమెరికా.. ఆ దుర్మార్గమైన పనిని చేసిన నగరానికి ఒక అమెరికా అధ్యక్షుడు వచ్చింది లేదు. ఆ లోటును తీరుస్తూ బరాక్ ఒబామా తాజాగా హిరోషిమాను సందర్శించారు. ఈ సందర్భంగా హిరోషిమా శాంతి స్మారక వనంలో పుష్పగుచ్చాన్ని ఉంచి బాధితులకు నివాళి అర్పించిన ఒబామా తర్వాత చేసిన ప్రసంగం విన్నప్పుడు పెద్దన్న మాటలకు చేతలకు ఎంత తేడా అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

తమ పూర్వీకుల కారణంగా లక్షలాది మంది మరణించటమే కాదు.. లక్షలమంది ఇప్పటికి ఆ దారుణ ప్రభావానికి గురై బతుకును భారంగా వెళ్లదీస్తున్నా.. ఆ దారుణం మీద క్షమాపణలు చెప్పే పెద్ద మనసు లేదన్న విషయాన్ని కరాఖండిగా చెప్పేయటం తెలిసిందే. సారీ చెప్పటానికి మాట రాని అమెరికా అధ్యక్షడు.. హిరోషిమాలో మాట్లాడినప్పుడు మాత్రం అపారమైన కరుణ రసాన్ని పొంగించటం గమనార్హం.

‘’71 ఏళ్ల కిందట మృత్యుభూతం ఆకాశం నుంచి విరుచుకుపడింది. మానవజాతి స్వీయ విధ్వంసక మార్గాన్ని సృష్టించుకున్నదని ఆ బాంబు రుజువు చేసింది. నాటి చిన్నారుల నిశ్శబ్ద మృత్యురోదనను వింటూ.. బాంబు విస్పోటపు భయంకర క్షణాలు వారి మనోభావాలను ఊహించుకుంటూ ఆత్మశోధన చేసుకోవాలనే ఈ నగరానికి వచ్చా’’ అని ఒబామా చెప్పుకున్నారు. మరి.. అంత భావోద్వేగంతో మాటలు చెప్పిన ఒబామా.. తమ పెద్దలు చేసిన భయంకరమైన తప్పునకు సారీ చెప్పేయొచ్చుగా. క్షమాపణలు చెప్పేందుకు రాని నోరు.. మృత్యురోదనలు వింటున్నా అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టటానికి మాటలు రావటం చూస్తే.. పెద్దన్న అహంకారం ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థం కాక మానదు.