కశ్మీరీ వేర్పాటు పెద్దాయన ట్వీటు.. ఇద్దరి ఉద్యోగాలు పోయాయ్

Mon Aug 19 2019 16:46:24 GMT+0530 (IST)

కశ్మీర్ ను స్వతంత్ర దేశంగా చూడాలంటూ బలమైన వాదనను వినిపించటమే కాదు.. కశ్మీర్ వ్యాలీలో యువతను తన మాటలతో కట్టి పడేసే వేర్పాటు నేతల్లో పెద్దాయనగా పేరుంది 91 ఏల్ల సయ్య్ అలీషా గిలానీ. వయసులో ఇంత పెద్ద అయినప్పటికీ.. వేర్పాటు వాదం విషయంలో మహా కరకుగా ఉంటారు. అంతేనా.. కశ్మీర్ శాంతిభద్రతల్ని తీవ్రప్రభావితం చేసే శక్తి ఉన్న నేతగా ఆయనకు పేరుంది. గతంలో ఆయన పుణ్యమా అని కశ్మీర్ వ్యాలీలో నెలల తరబడి బంద్ సాగిన సందర్భాల్ని మర్చిపోలేం.ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వీలుగా మాజీ ముఖ్యమంత్రులతో పాటు.. గిలానీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కశ్మీర్ వ్యాలీలో రాజకీయ అగ్రనేతలు.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో సహా.. ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న వారందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కశ్మీర్ వ్యాలీలో నెట్.. సెల్ ఫోన్.. ల్యాండ్ లైన్లు పని చేయని విషయం తెలిసిందే. కమ్యునికేషన్ల మీద పెద్ద ఎత్తున ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. హౌస్ అరెస్ట్ లో ఉన్న గిలానీ ట్వీట్ చేయటం కలకలం రేపింది.

జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేస్తూ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టటానికి ముందు నుంచే కేంద్ర సర్కారు జమ్ముకశ్మీర్ వ్యాలీలో అన్ని రకాల సమాచార వ్యవస్థల్ని స్తంభింపచేశారు. ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370పై తన నిర్ణయాన్ని ప్రకటించటానికి ఒక రోజు ముందే కమ్యునికేషన్లను బ్లాక్ చేశారు.
చాలా పరిమిత సంఖ్యలో.. అది కూడా జమ్ముకశ్మీర్ లోని పాలనా విభాగంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి ఫోన్లు.. నెట్ పని చేసే అవకాశాన్ని కల్పించారు. అది మినహా మరెవరికీ ఫోన్లు పని చేసే అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి వేళ.. గిలానీ ట్వీట్ చేయటం సంచలనంగా మారింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ట్వీట్ పోస్టు చేసే అవకాశం ఎలా వచ్చిందన్న అంశంపై విచారణ చేపట్టారు.

దీనికి ఇద్దరు బీఎస్ ఎల్ ఎన్ అధికారుల పాత్ర ఉందన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. వెంటనే వారిద్దరిపైనా చర్యలు తీసుకుంటూ వేటు వేశారు. గిలానీకి సహకరించినట్లుగా తేల్చిన అధికారులు.. వారిద్దరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.