ఎక్కడో కామెంట్ చేస్తే హైదరాబాద్ నుంచి పంపిచేస్తారా?

Mon Jul 23 2018 23:05:54 GMT+0530 (IST)

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నగర బహిష్కరణ వ్యవహారంలో బహిష్కరణకు గురైన కత్తి మహేశ్ సైలెంటైపోయినా.. బహిష్కరణకు గురైన మరో వ్యక్తి పరిపూర్ణానంద మాత్రం ఆ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టలేదు. తనను బహిష్కరించడానికి గల కారణాలను ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన  దాఖలు చేసిన పిటిషన్ పై  సోమవారం హైకోర్టులోవాదనలు కొనసాగాయి. తనను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ.. హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తన బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధమని - గూండాలను మాత్రమే నగరం నుంచి పోలీసులు బహిష్కరిస్తారని పరిపూర్ణానంద పిటిషన్ లో పేర్కొన్నారు.
   
గతంలో ఆదిలాబాద్ లో - కరీంనగర్ లో పరిపూర్ణానంద చేసిన ప్రసంగాలను ఆధారంగా చూపించి ఎలా బహిష్కరిస్తారని.. హైదరాబాద్ పరిధిలో ఎలాంటి కేసులు లేకుండా ఎలా బహిష్కరిస్తారని పరిపూర్ణానంద తరఫున వాదనలు వినిపిస్తున్న మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.  పరిపూర్ణానంద చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు మొదటి అనుమతి ఇచ్చి తర్వాత ఎందుకు అనుమతి నిరాకరించారో తెలపాలని కోరారు.
   
ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని పరిపూర్ణానంద తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పరిపూర్ణానందపై వేసిన నగర బహిష్కరణ ఎత్తివేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పరిపూర్ణానంద బహిష్కరణకు సంబంధించి.. ఒరిజినల్ డాక్యుమెంట్లను మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.