Begin typing your search above and press return to search.

రూ.30వేలతో మనోళ్ల గాలితో నడిచే కారు

By:  Tupaki Desk   |   2 May 2016 6:53 AM GMT
రూ.30వేలతో మనోళ్ల  గాలితో నడిచే కారు
X
ప్రోత్సహించాలే కానీ మనోళ్లు ఎవరికీ ఎంతమాత్రం తక్కువ కాదు. అరకొర ప్రోత్సహంతోనే అద్భుతాలు సృష్టించే మనోళ్లను సరిగ్గా సానపట్టాలే కానీ.. ప్రపంచానికే తలమానికం లాంటివెన్నింటినో సృష్టించొచ్చన్న విషయాన్ని వెల్లడించే ఉదంతమిది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ ఇంధనానికి ప్రత్యామ్నాయ ఇంధనాల మీద దృష్టి సారిస్తూ.. అందుకోసం భారీ ఎత్తున ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్.. డీజిల్.. సోలార్ పవర్ తో కాకుండా.. నీరు.. గాలితో నడిచే వాహనాల మీద పెద్ద ఎత్తున ప్రయోగాలు సాగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా గాలితో నడిచే వాహనాన్ని తయారు చేశారు సికింద్రాబాద్ లోని స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ కాలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు (రమేష్.. శ్రీకర్.. భార్గవ్.. లలిత్ సింగ్ లు) తమ ప్రాజెక్టులో భాగంగా గాలితో నడిచే వాహనాన్ని తయారు చేశారు. ఇందుకోసం కాలేజీ ప్రొఫెసర్లు తోడ్పాటు అందించారు.

గాలితోనడిచే వాహనాన్ని తయారు చేయటానికి వారు చేసిన ఖర్చు రూ.30వేలు మాత్రమే కావటం గమనార్హం. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాహనాన్ని మరింత అభివృద్ధి చేస్తే.. మరింత వేగంగా ప్రయాణించే వాహనంగా తయారు చేయొచ్చని వారు చెబుతున్నారు. ఇలాంటి వాటిని తయారు చేసే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి.. పరిశోధన రంగం వైపు వారు దృష్టి పెట్టేలా చేస్తే.. అద్భుతాల ఆవిష్కరణకు అవకాశం ఉంటుందనటంలో సందేహం లేదు.