Begin typing your search above and press return to search.

విద్యార్థుల్ని ప్రశ్నించిన యువరాజు బుక్ అయ్యాడే

By:  Tupaki Desk   |   25 Nov 2015 1:36 PM GMT
విద్యార్థుల్ని ప్రశ్నించిన యువరాజు బుక్ అయ్యాడే
X
కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఇకపై.. తన మాటలకు తగ్గ ప్రశ్నలు వేసి.. ప్రజల నుంచి తనకు అనుకూలమైన సమాధానాలు రాబట్టుకునే ఎత్తుగడను ప్రదర్శించి అడ్డంగా బుక్ అయ్యారు. సాధారణంగా అగ్రనాయకులు తాము చెప్పే మాటలకు తగిన సమాధానం కోసం కొన్ని ప్రశ్నలు వేయటం.. తాము కోరుకున్నట్లుగా సమాధానాలు ఆశించటం మామూలే. ఇక్కడే.. రాహుల్ అంచనా తప్పు అయ్యి.. అనుకోని పరాభవం ఆయనకు ఎదురైంది.

బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీకి వచ్చిన రాహుల్ వారితో ముచ్చడించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్.. మేకిన్ ఇండియాలపై ఆయన ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. సూటుబూటు సర్కారు అంటూ మోడీ సర్కారుపై విమర్శలు చేసిన ఆయన.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇక్కడితో వ్యవహారం ముగిస్తే బాగుండేది. మోడీ సర్కారు మీద అలవాటులో భాగంగా విమర్శలు చేసిన ఆయన.. తర్వాత మోడీ సర్కారు చెబుతున్నట్లుగా స్వచ్ఛభారత్ పని చేస్తుందా? అన్న ప్రశ్నను వేశారు.

దీనికి రాహుల్ ఆశించిన సమాధానం ‘నో’ అని. కానీ.. యువరాజు ఆశించిన దానికి భిన్నంగా.. ‘అవును’’ అని బిగ్గరగా సమాధానం రావటంతో ఆయనకు దిమ్మ తిరిగినంత పనైంది. స్వచ్ఛభారత్ అమలు కావటం మీరు చూశారా? అంటూ మరో ప్రశ్న వేసి.. తనకు అనుకూల సమాధానం చెప్పించుకోవాలన్న విఫలయత్నం చేశారు. ఈసారి.. విద్యార్థులు అవునని అనటంతో గతుక్కుమన్నారు. వెంటనే తన మాటల్ని సరి చేసుకుంటూ ‘‘ఓకే.. స్వచ్ఛ భారత్ బాగా పని చేస్తున్నట్లు నాకు కనిపించటం లేదు’’ అంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.

అనంతరం.. మేకిన్ ఇండియా విషయంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం.. విద్యార్థుల నుంచి ఆయన ఆశించిన సమాధానం రాకపోవటంతో యువరాజు నిరాశ పడిన పరిస్థితి. కాకుంటే.. స్వచ్ఛ భారత్ తో పోలిస్తే.. మేకిన్ ఇండియా విషయంలో విద్యార్థుల మాటలో మిశ్రమ స్పందన లభించటంతో.. తన ఎత్తులు పారటం లేదని భావించిన రాహుల్.. విద్యార్థుల్ని ప్రశ్నించటం వదిలేసి తాను చెప్పాలనుకున్నది చెప్పి ముక్తాయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్.. విద్యార్థులు చురుగ్గా ఉన్నట్లు వ్యాఖ్యలు చేశారు. తమ సర్కారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో మోడీ గురించి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వినటం రాహుల్ కు మహా ఇబ్బంది కలిగి ఉండటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.