పోటీ కోసం కోదండరాం ఓట్ల లెక్క

Mon Sep 24 2018 07:00:01 GMT+0530 (IST)

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి...అనంతరం అనూహ్య రీతిలో నిరస జెండాను ఎత్తుకున్న ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి పేరుతో సొంత పార్టీని ఏర్పాటుచేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పడ్డ నాటి నుండి అన్నీ తానై కోదండరాం ముందుకు నడిపిస్తున్నారు. కమిటీల ఏర్పాటు - బూత్ లెవల్లో పార్టీ పనితీరు - పార్టీ విభాగాల ఏర్పాటు ఇలా అన్ని అంశాలపై తనదైన ముద్రవేస్తూ వస్తున్నారు. అయితే - సొంతంగా పార్టీ నిర్మాణం పూర్తి కాకముందే..ముందస్తు ఎన్నికలు వచ్చిపడిన నేపథ్యంలో...ఒంటరిపోరు కంటే...కూటమిని ఆయన నమ్ముకున్నారు. కాంగ్రెస్-టీడీపీ-సీపీఐలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఆయన బరిలో దిగుతున్నారు. అయితే ఈ కూటమిలో హాట్ టాపిక్ అయిన కోదండరాం ఎక్కడి నుంచి బరిలో దిగుతారనేది దానిపై కొత్త చర్చ మొదలైంది.మహా కూటమిలో భాగస్వామ్యం పంచుకుంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారన్నది రాష్ట్రవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. అయితే ఈ సందేహాలకు కోదండరాం ఓట్ల రాజకీయం తెరమీదకు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆయన సొంత జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం నుంచి బరిలో దిగే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత జిల్లా కావడం...గతంలో చేసిన ఉద్యమాల ప్రభావం తనకు అనుకూలంగా మారుతుందని నమ్ముతున్నారు. అయితే ఇక్కడ కంటే మరో నియోజకవర్గంపై కూడా ఆయన నజర్ వేసినట్లు చెప్తున్నారు. కాకతీయ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న కోదండరాం ఆ వర్సిటీ పరిధిలోకి కవర్ అయ్యే వరంగల్ వెస్ట్ నుంచి బరిలో దిగనున్నట్లు చెప్తున్నారు.

ఇందుకు అనేక కారణాలను రాజకీయవర్గాలు టీజేఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడే విద్యాభ్యాసం చేసిన కోదండరాం స్నేహితులతో పాటు వామపక్ష భావజాలం ఉన్న వారంతా అండగా ఉంటారని నమ్ముతున్నారు. ఇక విద్యావంతుల వేదిక సైతం ఇక్కడ బలంగా ఉంది. దీంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు నల్లేరుపైనడకేనని టీజేఎస్ నేతలు అంటున్నారు. దీంతో  పాటుగాపేద మద్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరితో పాటు విద్యార్దులు యువత అధికం. తన సామాజిక వర్గం వారి ఓట్లు కూడా ఆయనకే పడుతాయంటున్నారు. సామాజిక ఉద్యమకారులతో సన్నిహిత సంబంధాలు వారి పోరాటాలకు ఆయన నైతిక మద్దతు ఇవ్వడం ప్లస్ అవుతుంది. ఈ నేపథ్యంలో కోదండరాం ఆర్ట్స్ కాలేజీ పరిధిలోకి వచ్చే వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగవచ్చని విశ్లేషిస్తున్నారు.