Begin typing your search above and press return to search.

దేశాధ్య‌క్షుడు ట్రంప్ వ‌ల్లే - తెలుగు కుటుంబం

By:  Tupaki Desk   |   24 Feb 2017 12:01 PM GMT
దేశాధ్య‌క్షుడు ట్రంప్ వ‌ల్లే - తెలుగు కుటుంబం
X
అమెరికాలో జ‌రిగిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కుచిబొట్ల శ్రీ‌నివాస్ ప్రాణాలు కోల్పోవడం మన దేశంలోని అనేక మందిని కలచివేసింది. కాగా, మీడియాతో ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ‌స‌భ్యులు స్పందించారు. హైద‌రాబాద్‌ లో కుచిబొట్ల సోద‌రుడు మీడియాతో మాట్లాడారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ - స్థానిక బీజేపీ బృందాలు, తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. వీలైనంత త్వరగా శ్రీ‌నివాస్ మృత‌దేహాన్ని తీసుకురావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మ దేశం విడిచి వెళ్లాల‌ని అరుస్తూ ఓ శ్వేత‌జాతీయుడు త‌న సోద‌రుడిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు ఆయ‌న తెలిపాడు. వ‌ల‌స‌దారుల‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్న దేశాధ్య‌క్షుడు ట్రంప్ వ‌ల్లే ఇదంతా జ‌రిగిన‌ట్లు శ్రీ‌నివాస్ సోద‌రుడు ఆరోపించాడు.

కాగా, శ్వేత‌జాతీయుడి కాల్పుల్లో తెలుగు యువ‌కుడు శ్రీ‌నివాస్ ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ స్పందించారు. కాల్పుల ఘ‌ట‌న త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌న్నారు. శ్రీ‌నివాస్ కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు సుష్మా ట్వీట్‌ లో వెల్ల‌డించారు. కాల్పుల ఘ‌ట‌న అంశంపై అమెరికాలో ఉన్న భార‌తీయ దౌత్య‌వేత్త న‌వ్‌ తేజ్ స‌ర్న‌తో మాట్లాడిన‌ట్లు ఆమె చెప్పారు. ఇద్ద‌రు భార‌త దౌత్యాధికారుల‌ను కేన్స‌స్ రాష్ట్రానికి పంపిన‌ట్లు సుష్మా వెల్ల‌డించారు. షూటింగ్ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ అలోక్ హాస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన‌ట్లు అంబాసిడ‌ర్ తెలిపార‌ని సుష్మా పేర్కొన్నారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చేశాడు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో టెక్సాస్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందాడు. కాల్పుల్లో గాయపడ్డ అలోక్ వరంగల్ నగరానికి చెందినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/