Begin typing your search above and press return to search.

పనిమనిషి చేతులు నరికేసిన సౌదీ రాక్షసులు

By:  Tupaki Desk   |   9 Oct 2015 8:06 AM GMT
పనిమనిషి చేతులు నరికేసిన సౌదీ రాక్షసులు
X
అరబ్ దేశాల్లో పనికోసం వెళ్లేవారు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు... అక్కడ యజమానులు పెట్టే చిత్రహింసలు మామూలుగా ఉండదు. నూటికి 90 మంది యజమానులు కఠినాత్ములే. ఒకరిద్దరు మాత్రమే పనివాళ్లనూ మనుషులుగా చూస్తారు. అసలు పనిలో చేరగానే వారి పాస్ పోర్టు - వీసాలు తీసుకుంటుంటారు... తరువాత సక్రమంగా జీతం ఇవ్వక తిండిపెట్టక... నిద్రకూడా పోనివ్వకుండా పనులు చేయిస్తారు... కొడతారు - తిడతారు... ఇదేమిటని అడిగితే మెడపట్టి గెంటేసి పోలీసులకు ఫోన్ చేస్తారు. పాస్ పోర్టు - వీసాలు లేకుండా తిరుగుతున్నారని చెబుతారు... దాంతో వారు జైళ్లో పడతారు.

తాజాగా సౌదీ అరేబియాలో అత్యంత దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. పనిచేస్తున్న ఇంటి యజమానిపై ఫిర్యాదు చేయడం - తప్పించుకోవాలని ప్రయత్నించడంతో వారు ఏకంగా ఓ మహిళ చేతులను నరికేశారు. తమిళనాడుకు చెందిన కస్తూరి మునిరథినమ్‌(50) కొంత కాలంగా ఆమె సౌదీ అరేబియా రాజధాని నగరమైన రియాద్‌ లోని ఓ ఇంట్లో పని చేస్తోంది. సెప్టెంబర్ 29న యజమానులు ఆమె చేతులు నరికేశారు. మూడు నెలల కిందటే సౌదీ వెళ్లి అక్కడ పనికి కుదిరిన కస్తూరికి తిండిపెట్టకుండా నానా ఇబ్బందులు పెట్టడంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

యజమానులు పెడుతున్న చిత్రహింసలు భరించలేక వారి ఇంటి బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమె చేతులు నరికేశారు.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటనను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాము ఇలాంటి ఘటనలు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఓ భారత మహిళను ఈ విధంగా చిత్రహింసలకు గురిచేయడం తమను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు. బాధితురాలితో భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.