అమెజాన్ ను భారతీయులు బహిష్కరించాలా?

Thu Jan 12 2017 10:06:33 GMT+0530 (IST)

తప్పులు జరగటం సహజం. కానీ.. జరిగిన తప్పును వేలెత్తి చూపించిన మరుక్షణం.. చెంపలేసుకొని తప్పును ఒప్పుకుంటే అక్కడి వివాదం సమిసిపోతుంది. కానీ.. అహంకారం.. ఒళ్లు బలుపు.. మాకేంటన్న పొగరు లాంటివి నెత్తికి ఎక్కితే ఎలా ఉంటుందో.. తాజాగా అమెజాన్ కెనడా తీరు ఇంచుమించు అదేరీతిలో ఉందన్న విమర్శల జోరు తాజాగా పెరిగాయి. తాజాగా చోటు చేసుకున్న ఉదంతమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఈ కామర్స్ దిగ్గజంగా సుపరిచితమైన అమెజాన్ కెనడాకు సంబంధించిన ఒక ఉదంతం భారతీయుల్నిఅమితంగా బాధిస్తోంది. తన ఈకామర్స్ సైట్లో.. త్రివర్ణ పతాకంతో కూడిన డోర్ మ్యాట్స్ ను విక్రయిస్తోంది. ఇది భారత్ ను కించపర్చటమేనని.. వాటి అమ్మకాలు తక్షణమే ఆపేయాలని.. ఇప్పటికే అమ్మిన వాటిని వెనక్కి తెప్పించాలంటూ పెద్ద ఎత్తున భారతీయులు డిమాండ్ చేస్తున్నా.. ఇప్పటివరకూ అమెజాన్ స్పందించకపోవటం గమనార్హం.

చివరకు ఛేంజ్.ఆర్గ్ అమెజాన్ చర్యకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో పిటీషన్ వేసినా సదరు సంస్థ స్పందించకపోవటం చూస్తుంటే.. అమెజాన్ కు మరీ అంత ఒళ్లు బలుపా అన్న సందేహం తలెత్తుతోంది. ఈ పిటీషన్ ఈ నెల 5 నుంచి ఆన్ లైన్లో తిరుగుతోంది. అమెజాన్.కామ్ లో ఈ తరహా ఉత్పత్తులపై వెనక్కి తగ్గినా.. అమెజాన్ కెనడా మాత్రం తన అమ్మకాల్ని కొనసాగిస్తోందని చెబుతున్నారు.

దీనిపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. అమెజాన్ వెనువెంటనే డోర్ మ్యాట్ అమ్మకాలు నిలిపివేయాలని.. భేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో అమెజాన్ కు.. ఆ సంస్థ ఉద్యోగులకు భారత వీసాలను నిషేధిస్తామని.. ఇప్పటికే ఇచ్చిన వారి వీసాల్ని రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. అతుల్ భోబే అనే వ్యక్తి అమెజాన్ కెనడా విక్రయిస్తున్న త్రివర్ణ పతకంతో కూడిన డోర్ మ్యాట్ ను విక్రయిస్తున్న విషయాన్ని సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. మరి.. సుష్మా వార్నింగ్ కు అమెజాన్ కెనడా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/