Begin typing your search above and press return to search.

కేంద్ర‌మంత్రి కితాబుః ఏపీ గ్రేట్ ఆండ్ డైన‌మిక్ స్టేట్‌

By:  Tupaki Desk   |   31 May 2016 9:58 AM GMT
కేంద్ర‌మంత్రి కితాబుః ఏపీ గ్రేట్ ఆండ్ డైన‌మిక్ స్టేట్‌
X
రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖలు చేయాల్సిన నేప‌థ్యంలో హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్ర‌భు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాన్ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా అసెంబ్లీలో నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రేట్ ఆండ్ డైన‌మిక్ స్టేట్ అని అభినందించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో...ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌భుత్వం అంతే వేగంగా ముందుకువెళుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌కు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం క‌ల్పించినందుకు టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబుకు సురేశ్ ప్ర‌భు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక గురించి టీడీపీ యువ‌నేత లోకేష్ మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌తిపాద‌న మేర‌కు కేంద్ర మంత్రి సురేశ్ ప్ర‌భును పెద్ద‌ల స‌భ‌కు పంపిస్తున్న‌ట్లు చెప్పారు. మ‌రో కేంద్ర‌మంత్రి - టీడీపీ నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి పార్టీ కోసం కష్ట‌ప‌డ్డార‌ని అంతేకాకుండా ఏపీ అభివృద్ధికి సుజ‌నా చౌద‌రి పోరాడార‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ సుజ‌నా చౌద‌రి పార్టీకోసం సేవ‌లందించార‌ని చెప్పారు. రాయ‌ల‌సీమ వాసిగా టీజీ వెంక‌టేశ్‌ కు అవ‌కాశం ద‌క్కింద‌ని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన టీజీ వెంక‌టేశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ్య‌స‌భ‌కు త‌మ‌ను ఎంపిక చేయ‌డంలో చంద్ర‌బాబు ఆలోచ‌న తీరును అర్థం చేసుకోవాల‌న్నారు. ఏపీ నుంచి ఐదుగురు కేంద్ర‌మంత్రులు ఢిల్లీలో ప్రాతినిద‌ద్యం వ‌హించిన‌ట్లు అవుతుంద‌ని చెప్పారు. కేంద్ర‌మంత్రులు వెంక‌య్య‌నాయుడు - అశోక్‌ గ‌జ‌ప‌తిరాజు - సుజ‌నా చౌద‌రి - తెలుగువారి కోడలు నిర్మ‌లా సీతారామ‌న్‌ ల‌కు తోడుగా ఇపుడు సురేశ్ ప్ర‌భు సైతం రాష్ట్ర ప్ర‌జ‌ల అంశాల‌ను ప్ర‌స్తావిస్తార‌ని అన్నారు. తెలుగువారి సంక్షేమం కోణంలో చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకుంటార‌ని వీటిని అంద‌రూ అంగీక‌రించాల‌ని టీజీ కోరారు. ఈ సంద‌ర్భంగా లోకేష్‌ ను టీజీ వెంక‌టేశ్ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు.