Begin typing your search above and press return to search.

అయోధ్య‌పై కీల‌క ఆదేశాలు జారీ చేసిన సుప్రీం

By:  Tupaki Desk   |   21 March 2017 6:34 AM GMT
అయోధ్య‌పై కీల‌క ఆదేశాలు జారీ చేసిన సుప్రీం
X
ఏళ్ల‌కు ఏళ్లుగా న‌లుగుతున్న అయోధ్యలోని వివాదాస్ప‌ద క‌ట్టడానికి సంబంధించిన అంశంపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. అయోధ్య‌లో రామాల‌యాన్ని నిర్మించ‌ట‌మే త‌న జీవిత ధ్యేయంగా చెప్పుకునే వివాదాస్ప‌ద నేత యోగి ఆదిత్య‌నాథ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు అందుకున్న వేళ‌లోనే.. సుప్రీంకోర్టు అయోధ్య అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి తాజాగా సుప్రీంకోర్టులో అయోధ్య ఇష్యూను త్వ‌ర‌గా తేల్చాలంటూ ఒక పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీనికి స్పందించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. అయోధ్య వ్య‌వ‌హారంలో సంబంధం ఉన్న భాగ‌స్వామ్య ప‌క్షాల‌న్నీ కూర్చొని ఈ అంశంపై చ‌ర్చ జ‌ర‌పాల‌ని.. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని వ్యాఖ్యానించింది.

కోర్టు బ‌య‌ట జ‌రిగే చ‌ర్చ‌ల్లో హిందూ.. ముస్లిం మ‌త పెద్ద‌లు ఈ అంశంపై ఇరువురికి ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చినా కేసును మూసివేయ‌టానికి.. మ‌రో విచార‌ణ లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇరుప‌క్షాల వారి మ‌ధ్య చ‌ర్చ‌లు విఫ‌ల‌మైనా.. సానుకూలంగా సాగ‌నిప‌క్షంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌టానికి కూడా తాము సిద్ధ‌మ‌ని సుప్రీం పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

ఈ కేసును కొన‌సాగించ‌టం త‌మ‌కు ఇష్టం లేద‌ని చెప్పిన సుప్రీం.. ఈ వాజ్యంతో సంబంధం ఉన్న వారంతా క‌లిసి.. కూర్చొని ఒక నిర్ణ‌యానికి రావాల‌ని.. ఆ విష‌యాన్ని మార్చి 31నాటికి కానీ.. అంత‌కు ముందే అయినా త‌మ దృష్టికి తీసుకురావాల‌ని వ్యాఖ్యానించింది. ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చే వారానికి వాయిదా వేసింది.

ఈ కేసును దీర్ఘకాలం తాము వాయిదాలు వేయ‌లేమ‌ని సుప్రీం పేర్కొన్న‌నేప‌థ్యంలో.. ఈ అంశంపై కీల‌క ప‌రిణామాలు రానున్న కొద్దిరోజుల్లో చోటు చేసుకున్న‌ట్లుగా చెప్పొచ్చు. ఎంతోకాలంగా సా..గుతూ.. సుప్రీం కోర్టులో ఉన్న నేప‌థ్యంలో స‌బ్దుగా ఉన్న అయోధ్య అంశం రానున్న రోజుల్లో మ‌రెన్ని కొత్త ప‌రిణామాల‌కు దారి తీస్తుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/