Begin typing your search above and press return to search.

స‌దావ‌ర్తి వేలంలో తేడాపై సుప్రీం మాట ఇదే!

By:  Tupaki Desk   |   22 Sep 2017 11:31 AM GMT
స‌దావ‌ర్తి వేలంలో తేడాపై సుప్రీం మాట ఇదే!
X

టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు స‌దావ‌ర్తి స‌త్రం భూముల వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగానే ప‌రిణ‌మించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీ ప‌రిధిలోని స‌దావ‌ర్తి స‌త్రానికి ఏపీతో పాటు త‌మిళ‌నాడులోనూ పెద్ద ఎత్తున భూములున్నాయి. ఈ భూముల్లో ఇప్ప‌టికే కొన్ని దారాక్ర‌మ‌ణ‌దారుల ప‌రం కాగా... మ‌రికొన్ని భూముల‌ను ఏపీ దేవాదాయ‌ - ధ‌ర్మాదాయ శాఖ అతి క‌ష్టం మీద ర‌క్షిస్తూ వ‌స్తోంది. ద‌శాబ్దాలుగా ప్ర‌భుత్వం చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌స్తున్న ఈ భూముల జాబితాలోని కోట్లాది రూపాయల విలువైన భూముల‌పై అధికార పార్టీకి చెందిన నేత‌ల కళ్లు ప‌డ్డాయ‌న్న వార్త‌లు గ‌తంలో వినిపించాయి. ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడు ప‌రిధిలో ఉన్న ఈ స‌త్రం భూముల‌ను ఆ పార్టీ ప్ర‌భుత్వం గుట్టుగా నిర్వ‌హించిన వేలంలో సొంత పార్టీ నేత చాలా త‌క్కువ ధ‌ర‌కు కొట్టేశారు. వెయ్యి కోట్ల‌కు పైగా విలువ చేసే ఈ భూముల‌ను స‌ద‌రు నేత‌... కేవ‌లం రూ.22 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు.

ఈ వేలం జ‌రిగిన తీరు - ఇందులో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును గ‌మ‌నించిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి... ఈ వ్య‌వ‌హారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గుట్టుచ‌ప్పుడు కాకుండా నిర్వ‌హించిన వేలాన్ని ర‌ద్దు చేయ‌డంతో పాటు కొత్త‌గా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న జారీ చేసి వేలం నిర్వ‌హించేలా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని ఆయ‌న కోర్టును విన్న‌వించారు. ఆళ్ల పిటిష‌న్‌ కు సానుకూలంగా స్పందించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తొలి సారి నిర్వ‌హించిన వేలాన్ని ర‌ద్దు చేయ‌డంతో పాటుగా కొత్తగా వేలం నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌ర్కారు అడుగ‌డుగునా క‌లిగించిన ఇబ్బందుల కార‌ణంగా ఆళ్ల కోర్టుకు ఏకంగా రూ.27 కోట్ల మేర నిధుల‌ను డిపాజిట్ చేయాల్సి వ‌చ్చింది. అయినా కూడా ఏమాత్రం బెద‌ర‌ని ఆళ్ల అంత పెద్ద మొత్తం డ‌బ్బును కోర్టు వ‌ద్ద డిపాజిట్ చేయ‌డంతో పాటుగా స‌దావ‌ర్తి స‌త్రం భూముల వేలంతో ప్ర‌భుత్వానికి మ‌రింత‌గా ఆదాయం వ‌చ్చేందుకు పోరు సాగించారు.

ఈ క్ర‌మంలో హైకోర్టు ఆదేశాల మేర‌కు వేలం ఏర్పాట్లు పూర్తి కాగా... ఆ వేలాన్ని అడ్డుకునేందుకు టీడీపీ స‌ర్కారు చేయ‌ని య‌త్నమంటూ లేదంటే న‌మ్మ‌శక్యం కాదేమో. అయితే కోర్టు వ‌ద్ద టీడీపీ స‌ర్కారు ప‌ప్పులేమీ ఉడ‌క‌కపోవ‌డంతో... చంద్ర‌బాబు స‌ర్కారు ఈ సారి ఏకంగా త‌మిళ‌నాడు స‌ర్కారును రంగంలోకి దించింది. వేలం జరిగిన భూములు త‌మ ప‌రిధిలోనే ఉన్నాయ‌ని, ఆ కార‌ణంతో త‌మ‌నున కూడా ఈ విచార‌ణ‌లో ఇంప్లీడ్ చేసుకోవాల‌ని త‌మిళ‌నాడు స‌ర్కారు పిటిష‌న్ వేసింది. అస‌లు ఏపీలో కార్య‌క‌లాపాలు సాగిస్తున్న స‌దావ‌ర్తి స‌త్రానికి త‌మిళ‌నాడులో భూములు ఉండ‌కూడ‌ద‌ని ఎక్క‌డా రూలు లేదు క‌దా. అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నేటి మ‌ధ్యాహ్నం స‌దావ‌ర్తి స‌త్రం భూముల వివాదంపై జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

త‌మిళ‌నాడు పిటిష‌న్‌ ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన కోర్టు... చంద్రబాబు స‌ర్కారు పాల్ప‌డ్డ అక్ర‌మాల‌ను తాము గుర్తించిన‌ట్లుగా ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసింది. అయినా తొలి సారి వేలం నిర్వ‌హిస్తే... కేవ‌లం రూ.22 కోట్లే వ‌స్తే... అదే రెండోసారి జరిగిన వేలంలో రూ.60 కోట్లెలా వ‌చ్చాయ‌ని జ‌స్టిస్ మిశ్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. మలిసారి జ‌రిగిన వేలంలోనే రూ.40 కోట్ల మేర అధిక ధ‌ర వ‌చ్చిందంటే... చంద్ర‌బాబు స‌ర్కారు తొలి సారి నిర్వ‌హించిన వేలం పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగిన‌ట్లుగా అనిపించ‌డం లేద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. అయినా ఏదో ట్ర‌స్టుకు సంబంధించిన భూములే క‌దా... ఎంత త‌క్కువ ధ‌ర‌కు అమ్మేసినా కోర్టులు క‌ళ్లు మూసుకుని ఉంటాయిలే అనుకోవ‌డానికి వీల్లేద‌ని, ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల‌న్నింటిపై న్యాయ వ్య‌వ‌స్థ ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. కోర్టులు క‌ళ్లు మూసుకుని కూర్చోవ‌న్న విష‌యాన్ని ప్ర‌భుత్వాలు గ‌మ‌నించాల‌ని కూడా జ‌స్టిస్ మిశ్రా... చంద్ర‌బాబు స‌ర్కారుకు డేంజర్ బెల్స్ మోగించార‌నే చెప్పాలి.

త‌మిళ‌నాడు ఇంప్లీడ్ పిటిష‌న్‌ పై స్పందించిన జ‌స్టిస్ మిశ్రా... ఆ భూములు సదావర్తి సత్రానివేనని స్పష్టంగా తెలుస్తోందని, అక్కడ జరిగిన ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత తమిళనాడు సర్కారుదేనని చెప్పారు. అంతకుముందు ఏపీ ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ... భూములను వేలంలో దక్కించుకున్న సంస్థ, ఇప్పుడు డబ్బు కట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది. రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి డబ్బులు కట్టే విషయమై రేపు మధ్యాహ్నం వరకూ గడువుందని గుర్తు చేసింది. ఈ వ్య‌వ‌హారంపైనా జ‌స్టిస్ మిశ్రా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ... విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేశారు. వెర‌సి నేటి విచార‌ణ‌లో సుప్రీంకోర్టు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో స‌దావ‌ర్తి భూముల‌కు సంబంధించి బాబు స‌ర్కారు ఆట‌లు ఇక చెల్ల‌వ‌నే చెప్పాలి.