మన దగ్గర పాక్ పోలిన జెండానా..?

Mon Jul 16 2018 19:20:14 GMT+0530 (IST)

ఆకుపచ్చని వస్త్రం మీద నెలవంక.. నక్షత్రాలతో కూడిన జెండాలు చాలాచోట్ల దర్శనమిస్తుంటారు. దాదాపుగా పాకిస్థాన్ లోని ముస్లిం లీగ్ పార్టీని పోలినట్లు ఉండే ఈ జెండాను మన దేశంలో ఎగరవేయరాదంటూ ఒక పిటిషన్ దాఖలు కావటం ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్ ను షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ వసీమ్ రిజ్వీ పిటిషన్ దాఖలు చేశారు.దేశవ్యాప్తంగా వివిధ భవనాల మీదా.. మతపరమైన ప్రాంతాల్లో ఈ జెండాలు కనిపిస్తున్నాయని.. వాటిని నిషేధించాలని కోరుతూ పిటిషన్ ను దాఖలు చేశారు.

దీనిపై విచారణను షురూ చేసిన సుప్రీంకోర్టు కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  నెలవంక.. నక్షత్రం జెండాలపై దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఏకే సిక్రీ.. జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టనుంది. కేంద్రం తరఫు సమాధానం చెప్పేందుకు అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పిటిషన్ తాలూకు కాపీలను అందించాలని రిజ్వీకి సూచించింది.

ముంబయితో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నెలవంక.. నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాల్ని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎగురవేస్తున్నారని.. వాటిని బ్యాన్ చేయాలని కోరారు. ఈ జెండాలు హిందూ.. ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. పాక్ భారత్‌కు శత్రుదేశమని.. అలాంటి జెండాలు దేశంలో ఉండటానికి వీల్లేదని ఆయన కోరారు. ఆకుపచ్చ నేపథ్యంలో నెలవంక.. నక్షత్రం అనేవి ఇస్లాం సంప్రదాయంలో ఎప్పుడూ భాగం కాదని.. ఇస్లాంకు వాటికి ఎలాంటి సంబంధం లేదని.. అందుకే వాటిని బ్యాన్ చేయాలని కోరారు. దీనిపై కేంద్రం సమాధానం కోసం సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మరి.. దీనిపై మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.