హిందూ వివాహ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Wed Sep 13 2017 13:35:02 GMT+0530 (IST)

భారతదేశంలో మెజార్టీగా ఉన్న హిందువుల వైవాహిక సంబంధాల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహచట్టం కింద విడాకులు మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా ఆరునెలల రాజీ గడువును పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దంపతులకు ఒకే ఇంటిలో నివసించే ఉద్దేశం లేకపోతే ఆ గడువును ట్రయల్ కోర్టు రద్దు చేయవచ్చని తెలిపింది.విడాకుల దరఖాస్తు తొలి - తుది విచారణకు మధ్య ఆరునెలల గడువు ఉండాలని హిందూ వివాహచట్టం సూచిస్తోంది. విడిపోయే దంపతుల మధ్య రాజీకి చివరి అవకాశంగా ఆ నిబంధనను చేర్చారు. చట్టంలోని 13బీ(2) నిబంధన తప్పనిసరికాదని - కోర్టు ఆదేశాలకు అది లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎనిమిదేళ్లుగా విడివిడిగా జీవిస్తున్న తమకు ఆరు నెలల సర్దుబాటు గడువు అవసరం లేదని ఓ జంట దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఏకే గోయల్ - జస్టిస్ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. విడిపోవాలనుకున్న దంపతులు సహేతుకమైన కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతే వారి తరఫున తల్లిదండ్రులు లేదా సహోదరులు హాజర య్యేందుకు వీలుకల్పించాలని సూచించింది.

ఈ ఆర్నెల్ల నిబంధనను తప్పనిసరిగా సదరు దంపతులకు వర్తింపజేయాలా వద్దా అన్నది ఆయా కేసులను విచారిస్తున్న న్యాయమూర్తుల విచక్షణకే వదిలేస్తున్నట్టు సుప్రీం కోర్టు మంగళవారం కీలక సూచన చేసింది. అంటే ఏడాది పాటు విడిగా జీవించిన వారికి ‘మనసులు కలిసే అవకాశం’ కల్పించేందుకు వీలుగా మరో ఆర్నెల్ల గడువు ఇవ్వడం అన్నది నిర్బంధం కాదని సుప్రీం బెంచి తేల్చిచెప్పింది. నిరర్థక వివాహాలను కొనసాగించి సదరు భార్యాభర్తల ఆవేదనను మరింత పొడిగించడమన్నది అర్థరహితమని తేల్చిచెప్పింది. ఇక తాము కలిసి ఉండలేమన్న కచ్చితమైన నిర్ణయానికి వచ్చేసిన జంటలకు ఆర్నెల్ల సయోధ్య గడువును ఇవ్వాలా వద్దా అన్నది న్యాయమూర్తులకే వదిలేస్తున్నామని తెలిపింది. వివాహాలను పరిరక్షించేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన ధర్మాసనం ‘వీరు కలిసి జీవించేందుకు అవకాశమే లేనప్పుడు తుది నిర్ణయాన్నీ వారికే వదిలేయాలి’అని పేర్కొంది.