యడ్డీ ప్రమాణంపై సుప్రీం ఫైనల్ గా చెప్పిందిదే

Thu May 17 2018 09:53:46 GMT+0530 (IST)

కర్ణాటక రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న వైనం తెలిసిందే. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రావాలంటూ కర్ణాటక గవర్నర్ లేఖ రాయటం.. అందుకు యడ్డీ ఓకే అంటూ ఈ రోజు (గురువారం) ఉదయం 9.30 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పటం తెలిసిందే.గవర్నర్ లేఖ బయటకు వచ్చిన వెంటనే.. అర్థరాత్రి వేళ సుప్రీంలో గవర్నర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని.. యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్ నేతలు సుప్రీం తలుపు తట్టటం తెలిసిందే. వరుస సంచలన పరిణామాల నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కింది.

సుప్రీంకోర్టులో అర్థరాత్రి మొదలైన వాదనలు తెల్లవారుజాము వరకు సాగగా.. గవర్నర్ పిలుపుపై తాము స్టే ఇవ్వలేమని సుప్రీం తేల్చి చెప్పింది. గవర్నర్ అధికారాల్ని తాము అడ్డుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. అయితే.. కాంగ్రెస్..జేడీఎస్ లు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయకుండా మరోమారు వాదనలు వింటామని పేర్కొంది.

అయితే.. గురువారం ఉదయం యడ్యూరప్ప చేసే ప్రమాణస్వీకారోత్సవం సుప్రీం తుది తీర్పుకు లోబడి ఉంటుందని వెల్లడించింది. శుక్రవారం(రేపు) ఉదయం 10.30 గంటలకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. యడ్యూరప్ప ఈరోజు ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.