దీక్ష చేసి మరీ!...దీదీ సారీ చెప్పారే!

Wed Feb 20 2019 09:58:10 GMT+0530 (IST)

రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉద్దేశ్యపూర్వక దాడి చేస్తోందంటూ అంతెత్తున ఎగిరిపడ్డ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు సరైన గుణపాఠమే జరిగిందని చెప్పాలి. కేంద్రం తన చేతిలోని దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థుల పైకి వదులుతోందని ఆరోపణలు గుప్పించిన దీదీ సర్కారు... మొన్నామధ్య బెంగాల్ ను అతలాకుతలం చేసిన శాదరా చిట్ ఫండ్ కేసు నిందితులకు బాసటగా నిలిచిన తీరు పెద్ద చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఓ పోలీసు అదికారిని విచారించేందుకు వచ్చిన సీబీఐ అధికారులపైకి తన రాష్ట్ర పోలీసులను ఉసిగొల్పిన దీదీ... నడిరోడ్డుపై రచ్చరచ్చ చేయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తాను కూడా నడిరోడ్డు మీదకు వచ్చి రెండు రోజుల పాటు ఏకంగా నిరాహార దీక్షలకు దిగారు. మొత్తంగా సీబీఐ తన అనుమతి లేకుండా తన రాష్ట్రంలో ఎలా ప్రవేశిస్తుందంటూ బీరాలు పలికిన దీదీ... ఇప్పుడు తాను చేసింది తప్పేనని ఇప్పుడు ఒప్పేసుకున్నారు.తాను నేరుగా ఈ తప్పును ఒప్పుకోకున్నా... తన ప్రభుత్వ ఉన్నతాదికారుల చేత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు దీదీ సారీ చెప్పించారు. దీదీ సర్కారులో రథచక్రాలుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - డీజీపీలతో పాటు ఈ రచ్చకు కారణమైన కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ లు సుప్రీంకోర్టుకు సారీ చెబుతూ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లను స్వీకరించిన కోర్టు.. కేవలం అఫిడవిట్లతోనే దీనిని సరిపెట్టలేమని - ఈ ముగ్గురు కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీసుకోనున్న నిర్ణయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. శారదా చిట్ ఫండ్ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ కు నేతృత్వం వహించిన రాజీవ్ కుమార్ కేసులోని పలు కీలక ఆధారాలను ధ్వంసం చేశారన్నది సీబీఐ ఆరోపణ. సిట్ చీఫ్ గా పదవీ బాధ్యతలు వదులుకున్న తర్వాత రాజీవ్ కుమార్ ను దీదీ సర్కారు... ఏకంగా కోల్ కతా కమిషనర్ గా నియమించింది.

అయితే ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే చేపట్టిన సీబీఐ... ఈ కేసు లోతుపాతులను తవ్వి తీసింది. ఈ క్రమంలో రాజీవ్ భాగోతం బయటపడింది. ఈ క్రమంలో రాజీవ్ ను విచారించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను దీదీ సర్కారు అడ్డుకుంది. అంతేకాకుండా సీబీఐ అధికారులను నిర్బంధించింది. దీనికి ప్రతిగా స్పందించిన కేంద్రం పారా మిలిటరీ బలగాలను దించగా... దీదీ నడిరోడ్డుపై దీక్షకు దిగారు. ఈ దీక్ష నాడు పెద్ద సంచలనమే అయ్యింది. అయితే ఆ తర్వాత దీదీ సర్కారు తీరును నిరసిస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు దిగివచ్చిన దీదీ సర్కారు క్షమాపణలు చెప్పి తన తప్పును ఒప్పేసుకుంది. ఇదిలా ఉంటే.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు ఊహించని శిక్ష విధించిన కోర్టు... ఇప్పుడు దీదీ సర్కారుకు కూడా అదే తరహా శిక్ష వేస్తారన్న వాదన వినిపిస్తోంది.