Begin typing your search above and press return to search.

కర్ణాటకకు కావేరీపై సుప్రీం లాస్ట్ ఛాన్స్

By:  Tupaki Desk   |   30 Sep 2016 2:16 PM GMT
కర్ణాటకకు కావేరీపై సుప్రీం లాస్ట్ ఛాన్స్
X
సుప్రీం సీరియస్ అయ్యింది. గడిచిన కొద్ది రోజులుగా కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన కావేరీ జలాల విషయంలో కర్ణాటక సర్కారుకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి.. మరింకెవరి ఆదేశాలు తమకు ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య ప్రభుత్వంపై సీరియస్ అయిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. మీకిదే లాస్ట్ ఛాన్స్ అంటూ ఇచ్చిన వార్నింగ్ పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 1 నుంచి ఆరో తేదీ వరకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల కావేరీ జలాల్ని తమిళనాడుకు విడిచిపెట్టాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయటం.. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించటం.. కర్ణాటక ప్రభుత్వం సైతం తమ ప్రయోజనాలే తప్పించి మరెవరీ ఆదేశాలు తమకు ముఖ్యం కాదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్ అయ్యింది. సుప్రీం జారీ చేసిన ఆదేశాల్ని అమలు చేయకుండా కర్ణాటక ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ తమిళనాడు ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో.. సుప్రీం ఈ వ్యవహారంపై తాజాగా విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా తమకు తాగునీటి సమస్య వస్తుందన్న ఉద్దేశంతోనే తమిళనాడుకు నీటిని విడుదల చేయటం లేదని స్పస్టం చేసింది. తమకు సుప్రీం ఆదేశాల్ని ధిక్కరించాలన్న ఉద్దేశం లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది.

కావేరీ నీరు ఉన్న నాలుగు జలాశయాలు అడుగంటిపోయాయని.. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి తమిళనాడుకు నీళ్లు విడుదల చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు కర్ణాటక తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నారీమన్. కావేరీ నీటిని విడుదల చేసిన క్రమంలో బెంగళూరుతో సహా మిగిలిన ప్రాంతాల ప్రజల అల్లాడిపోతారని పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీం సీరియస్ అవుతూ.. ‘‘మీరు భారతదేశంలో ఉన్నారని గుర్తుంచుకోండి. దేశంలో ఎవరైనా సరే సుప్రీం ఆదేశాల్ని పాటించాలి. నాలుగు వారాల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి. కేంద్రం ఈ పనిని పూర్తి చేయాలి. ఈ బోర్డు కర్ణాటకకు వెళ్లి కావేరీ జలాలపై అధ్యయనం చేయాలని.. అక్టోబరు ఆరున కోర్టులో నివేదిక ఇవ్వాలి’’ అని ఆదేశించింది.

అంతేకాదు.. కర్ణాటక రాష్ట్రానికి తాము ఇచ్చే చివరి అవకాశంగా పేర్కొన్న సుప్రీం కోర్టు.. తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయాలని ఆదేశించింది. తమ వాదనల్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా సుప్రీం కోర్టుతమపై మండిపడటం కర్ణాటక రాష్ట్రానికి కారం రాసినట్లుగా మారింది. మరోవైపు.. సుప్రీం ఆదేశాలపై తమిళనాడు హర్షం ప్రకటించింది. తాజా పరిణామాలతో సుప్రీం ఆదేశాలపై కర్ణాటక రాష్ట్రం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/