Begin typing your search above and press return to search.

కాళేశ్వ‌రంపై కేసీఆర్ కు భారీ ఊర‌ట‌

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:49 AM GMT
కాళేశ్వ‌రంపై కేసీఆర్ కు భారీ ఊర‌ట‌
X
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి తీపిక‌బురు వ‌చ్చేసింది. సీఎం కేసీఆర్ ప్ర‌తిష్ఠాత్మంగా తీసుకున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కీల‌క తీర్పు ఒక‌టి సుప్రీం వెల్ల‌డించింది. ఈ తీర్పు తెలంగాణ ప్ర‌భుత్వానికి భారీ ఊర‌ట‌గా చెప్పాలి. గ‌తంలో త‌ర‌చూ కోర్టుల నుంచి ఎదురుదెబ్బ‌లు త‌గిలే తెలంగాణ ప్ర‌భుత్వానికి భిన్నంగా.. తాజా ఇష్యూలో మాత్రం కేసీఆర్ స‌ర్కారుకు స్వీట్ న్యూస్ గా చెప్పాలి. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

అంతేకాదు.. పిటిష‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న‌ర్ ను మంద‌లించింది. ముంపు గ్రామాల్లో స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా ప‌నులు చేప‌డుతున్నార‌న్న వాద‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సుప్రీం.. చెన్నై బెంచ్ నుంచి ఢిల్లీకి ఎందుకు వ‌చ్చారంటూ పిటిష‌న‌ర్ ను ప్ర‌శ్నించింది.

షోరం హంటింగ్ చేస్తున్నారా? అంటూ మండిప‌డిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ఒక చోట‌కు కాక‌పోతే మ‌రో చోటుకు వ‌స్తారా? అంటూ చుర‌క‌లు వేసింది. కేసు విచార‌ణ‌కు అర్హం కాదంటూ.. పిటిష‌న‌ర్ ఆలోచ‌న స‌రిగా లేదంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు అడ్డుగా ఉన్న పిటిష‌న్ ను సుప్రీం కోర్టు కొట్టేసిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు రియాక్ట్ అయ్యారు.

సుప్రీం నిర్ణ‌యంపై సంతోషాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. కాళేశ్వ‌రం ప్రాజెక్టును అడ్డుకోవ‌టం ద్వారా తెలంగాణ అభివృద్ధిని ఆపాల‌న్న కుట్ర జ‌రిగింద‌న్నారు. సుప్రీంకు వెళ్లి వేసిన పిటిష‌న్ వెనుక ఎవ‌రు ఉన్నార‌న్న‌ది తాను త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డిస్తాన‌న్న ఆయ‌న‌.. ఇలాంటి కుట్ర‌ల‌తో తెలంగాణ అభివృద్ధిని ఆప‌లేరన్నారు.