Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రాన్ని సుప్రీం ఎంత మాట అనేసిందంటే..

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:54 PM GMT
ఆ రాష్ట్రాన్ని సుప్రీం ఎంత మాట అనేసిందంటే..
X
అత్యున్నత న్యాయస్థానం బీహార్ రాష్ట్ర సర్కారుపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా అనేయటమే కాదు.. చేసిన తప్పునకు ఆ మాత్రం మాటలు పడటం తప్పేం కాదన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం. నితీశ్ సర్కారుపై సుప్రీం అంతేసి మాటలు అనటానికి సమంజసమైన కారణం లేకపోలేదు. తాజాగా సుప్రీం అంతగా ఎందుకు సీరియస్ అయ్యిందన్న విషయం తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్లాల్సిందే. గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన షాబుద్దీన్ డబుల్ మర్డర్ కేసులో గడిచిన పదకొండేళ్లుగా జైల్లో ఉన్నాడు. అతనిపై ఉన్న మరో కేసుకు సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా చేసిన హంగామా అంతాఇంతా కాదు. నితీశ్ సర్కారులో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన షాబుద్దీన్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చినంతనే ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వందలాది కార్లు కాన్వాయ్ గా రాగా.. బుగ్గ కార్లలో దర్జాగా వెళ్లిన తీరు బీహార్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి. అప్పటివరకూ నితీశ్ మీద ఉన్న గౌరవ మర్యాదలు పడిపోవటమే కాదు.. ప్రభుత్వ తీరును పలువురు తీవ్రంగా తప్పు పట్టే పరిస్థితి.

ఎంత సంకీర్ణమైతే మాత్రం.. ఒక క్రిమినల్ విషయంలోనూ నితీశ్ రాజీ పడతారా? అన్న చర్చ మొదలైన నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా.. షాబుద్దీన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నితీశ్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై తాజాగా విచారించిన సుప్రీం.. బీహార్ రాష్ట్ర సర్కారును తలంటింది. అతడికి బెయిల్ ఇచ్చే దాకా నిద్రపోతున్నారా? షాబుద్దీన్ కేసు విచారణ వేగంగా పూర్తి చేయాటంలో ఉన్న ఆత్రుత.. అతడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఎందుకు లేదు? అంటూ ప్రశ్నించింది. సుప్రీం నుంచి ఇలాంటి సమాధానాన్ని ఊహించని బీహార్ సర్కారుకు తాజా పరిణామం షాకింగ్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.