పెళ్లి ఖర్చులపై సుప్రీం షాకింగ్ నిర్ణయం!

Thu Jul 12 2018 17:27:17 GMT+0530 (IST)

ఇప్పటితో పోలిస్తే గతంలో వరకట్న వేధింపుల కేసులు....ఆ నేపథ్యంలో హత్యలు - ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. ఆ సమస్య పూర్తిగా సమసిపోనప్పటికీ.....కేసులు సంఖ్య కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు. వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు గతంలో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ఆ మహమ్మారిని అరికట్టడం సాధ్యం కాలేదు. ఈ టెక్ జమానాలో కూడా కట్నపిశాచి కోరల్లో చిక్కి ఎంతోమంది అబలలు అశువులు బాశారు. ఈ నేపథ్యంలో వరకట్న దురాచారాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించేందుకు సుప్రీం కోర్టు నడుం బిగించింది. పెళ్లి సమయంలో జరిగే ఖర్చు వివరాలను తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. వరుడితోపాటు వధువు కుటుంబం కూడా తాము ఎంతెంత ఖర్చు చేసింది వివాహ ధృవీకరణ అధికారి దగ్గర నమోదు చేసేలా నిబంధన రూపొందించాలని సూచించింది.ప్రస్తుతం పెళ్లి వేడుకలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో లక్షల్లో ఖర్చు అవుతోన్న సంగతి తెలిసిందే. కట్నంతో పాటు ఆడపడుచు కట్నాలు - పసందైన విందు భోజనాలు....ఇలా రకరకాల అవసరాల కోసం వధువు కుటుంబానికి తడిసి మోపెడవుతుంది. కట్నం లేకుండా ఆదర్శ వివాహాలు జరిగే శాతం చాలా తక్కువ. ఈ క్రమంలో వరకట్న వేధింపుల కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దురాచారాన్ని రూపుమాపేందుకు సుప్రీం సిద్ధమైంది. వివాహ సమయంలో ఖర్చు వివరాలను తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇరు కుటుంబాలు సంయుక్తంగా ఖర్చు వివరాలను వివాహ ధ్రువీకరణ అధికారి వద్ద నమోదు చేయాలని సూచించింది. ఈ ప్రకారం నిబంధన రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీని వల్ల వరకట్న దురాచారం రూపుమాపడంతోపాటు వరకట్న నిషేధ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులను నివారించవచ్చని సుప్రీం అభిప్రాయపడింది. దాంతోపాటు పెళ్లి సమయంలో కొంత డబ్బు వధువు పేరిట డిపాజిట్ చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చని వ్యాఖ్యానించింది.