Begin typing your search above and press return to search.

సుప్రీంలో న్యాయ‌మూర్తుల మ‌ధ్య మ‌ళ్లీ విబేధాలు

By:  Tupaki Desk   |   22 Feb 2018 5:06 PM GMT
సుప్రీంలో న్యాయ‌మూర్తుల మ‌ధ్య మ‌ళ్లీ విబేధాలు
X
దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయనే వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. తాజాగా వివిధ ధర్మాసనాల మధ్య కేసుల విషయంలో గొడవ నడుస్తోంది. ఇప్పుడా పంచాయితీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా దగ్గరికి చేరింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలపై మరో రెండు ధర్మాసనాలు అభ్యంతరం తెలిపాయి. భూసేకరణకు సంబంధించిన కేసులను కొంతకాలం పెండింగ్‌ లో పెట్టాలని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఒకటి తమను కోరడంపై రెండు ధర్మాసనాలు చీఫ్ జస్టిస్‌ కు ఫిర్యాదు చేశాయి. జస్టిస్ అరుణ్ మిశ్రా - జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనాలు తమ ముందున్న భూసేకరణ కేసులపై ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిందిగా సీజేఐని కోరాయి. ఈ కేసులకు సంబంధించి ఒక రోజు ముందు జస్టిస్ మదన్ బీ లోకూర్ - జస్టిస్ కురియన్ జోసెఫ్ - జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను వాళ్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటికోసం ప్రత్యేకంగా ఓ ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని ఈ ముగ్గురు సభ్యుల ధర్మాసనం సీజేఐని కోరింది.

అసలు ఈ వివాదానికి కారణం ఏంటంటే.. 2014లో ఆర్‌ఎం లోధా - మదన్ బీ లోకూర్ - కురియన్ జోసెఫ్‌ లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ నెల 8న అరుణ్ మిశ్రా - ఆదర్శ్ గోయెల్ - శాంతనగౌడార్‌ లతో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. 2014 తీర్పునకు విరుద్ధంగా ఈ తాజా ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. బుధవారం ఇలాంటిదే మరో కేసు మదన్ లోకూర్ - జోసెఫ్‌ లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినపుడు.. అప్పట్లో అదే ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించింది. దీనిని తాను ఏమాత్రం సహించబోనని - సుప్రీంకోర్టు మొత్తం ఒకేలా వ్యవహరించాలి తప్ప.. ఇలా చేయడం ఏంటని జస్టిస్ జోసెఫ్ కురియన్ మండిపడ్డారు. దీంతో భూసేకరణ కేసులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే వరకు సుప్రీంకోర్టు - హైకోర్టుల జడ్జీలు ఎలాంటి కేసులను విచారించకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు దీనిపై సదరు రెండు ధర్మాసనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు సీజేఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.