Begin typing your search above and press return to search.

‘అమ్మ’ ఆరాచకం వారికీ అర్థమైందా?

By:  Tupaki Desk   |   29 July 2016 7:33 AM GMT
‘అమ్మ’ ఆరాచకం వారికీ అర్థమైందా?
X
తమిళనాడు రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. అధికారపక్షానికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. విమర్శలు చేసినా.. ఆ వెంటనే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవుతాయి. దీంతో పాటు.. తమ అధినేత్రి పరువు ప్రతిష్టల్నిదెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారంటూ పరువు నష్టం కేసుల్ని నమోదు చేయిస్తుంటారు. ఇది కార్యకర్తల దగ్గర నుంచి వ్యవస్థలోని వివిధ విభాగాలు సైతం ఈ అంశం మీద యమా యాక్టివ్ గా వర్క్ చేస్తుంటాయి.

ఈ కారణంతోనే రాజకీయ విమర్శలు ఆచితూచి ఉంటాయి. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. కానీ.. అమ్మ ఇలాకాలో అలా చేస్తే కేసులతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. అయితే.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని డీఎండీకే అధినేత విజయకాంత్ అమ్మ మీద విరుచుకుపడతారు.

మరి.. అమ్మ భక్తులు ఊరికే ఉండరు కదా. తమ అమ్మ ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ కోర్టులో కేసులు వేశారు. వీటి వాయిదాలకు విజయ్ కాంత్ హాజరు కాని నేపథ్యంలో ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తూ ఒక కోర్టు ఆదేశాలు జారీ చేయటంతో.. ఈ ఇష్యూను సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు కెప్టెన్. దీనిపై విచారణ జరిపిన అత్యుత్తమ న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది. ప్రభుత్వాలను విమర్శించే వారిపై ప్రతీకారం తీర్చుకునే రాజకీయ అస్త్రంగా పరువునష్టం కేసుల్ని ఉపయోగించకూడదంటూ కాసింత ఘాటుగానే స్పందించింది సుప్రీం. ప్రభుత్వాన్ని.. అధికారుల్ని విమర్శించే వారిపై కేసులు పెట్టటం ఒక భయానక పరిస్థితికి దారి తీస్తుందని అభిప్రాయ పడిన సుప్రీంకోర్టు.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను విమర్శించిన అంశంపై నమోదైన కేసు విచారణకు డీఎండీకే అధినేత విజయకాంత్ హాజరు కాని నేపథ్యంలో.. ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటాన్ని నిలిపివేసింది.

విజయకాంత్ దంపతులపై కింది కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తీరు చూస్తే.. ‘అమ్మ’ ఆరాచకం అత్యున్నత న్యాయస్థానానికి అర్థమైనట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనంగా సదరు న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.