Begin typing your search above and press return to search.

చాన్స్ వ‌స్తోందిః పాత నోట్లు పారేసుకోవ‌ద్దండి

By:  Tupaki Desk   |   22 March 2017 11:10 AM GMT
చాన్స్ వ‌స్తోందిః పాత నోట్లు పారేసుకోవ‌ద్దండి
X
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత సుదీర్ఘ కాలానికి వినిపించిన శుభ‌వార్త ఇది. రద్దయిన పెద్దనోట్లను బ్యాంకుల్లో జమచేయలేని వారికి మరో అవకాశం ఇవ్వడంపై మరో రెండు వారాల్లో నిర్ణయిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. పాతనోట్లు మార్చుకోవడంపై తేదీలు హఠాత్తుగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని కేంద్రాన్ని కోర్టు నిలదీసింది. సర్కారు మాట మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సర్కారు తీరును కోర్టు తప్పుబట్టింది.

మార్చి చివరి వరకు నగదు జమ చేసుకోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దాంతో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని సర్కారు తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. 2016 డిసెంబర్ 30 లోగా నిజమైన ఇబ్బందుల కారణంగా నోట్లు జమచేయలేక పోయినవారు ఆ తర్వాత 2017 మార్చి 31 వరకు రిజర్వ్‌బ్యాంక్ శాఖల్లో వాటిని మార్చుకోవచ్చని ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు అని ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎస్కే కౌల్ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

నిజమైన ఇబ్బందుల్లో ఉన్నవారికి మార్చి 31 వరకు మరో అవకాశం ఉంటుందని ప్రధాని మాటలు ఆశలు కలిగించాయని ధర్మాసనం నొక్కిచెప్పింది. ఎన్నారైలకు, విదేశీ పర్యటనలో ఉన్న భారతీయులకు మాత్రమే అవకాశం ఇచ్చి ఇతరులను ఎందుకు వదిలేశారని నిలదీసింది. ఏప్రిల్ 11 లోగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ప్రధాని హామీని తదనంతరం జారీచేసిన ఆర్డినెన్స్ రద్దు చేసిందని ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది సుధామిశ్రా కోర్టుకు తెలిపారు. నోట్ల మార్పిడి అవకాశాన్ని ఎవరికి కల్పించవచ్చన్న దానిపై.. అధికారాన్ని ప్రభుత్వానికి పార్లమెంటు అందజేసిందన్న అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. #మీకు నిర్ణయాధికారం ఉండొచ్చు. అది ఇష్టారీతిన ఉండరాదు. సర్కారే అంతిమ నిర్ణేత అని మీరు అంటున్నారు. దానిని ఒప్పుకునేందుకు మేం సిద్ధంగా లేం# అని ధర్మాసనం స్పష్టం చేసింది. డిసెంబర్ 30తో నోట్లమార్పిడి ముగిసిపోయినట్టు సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదని తెలిపింది.

ఎన్నారైలకు అవకాశం ఇచ్చి పౌరులను ఎందుకు వదిలేశారో మీరు వివరించాలి అని ధర్మాసనం తెలిపింది. మరోవైపు ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా వ్యవహరించినందున పిటిషనర్లు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చని ధర్మాసనం హెచ్చరించింది. అయితే పిటిషన్లను ఉపసంహరించుకుంటే వారిపై కేసులు వేయబోమని అటార్నీ జనరల్ హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/