Begin typing your search above and press return to search.

బండి మీద వెళ్లే ఇద్ద‌రూ హెల్మెట్ పెట్టుకోవాలంట‌

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:50 AM GMT
బండి మీద వెళ్లే ఇద్ద‌రూ హెల్మెట్ పెట్టుకోవాలంట‌
X
మీకు టూవీల‌ర్ ఉందా? బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మీతో పాటు.. వెనుక సీట్ లో ఎవ‌రో ఒక‌రు ఉంటారా? అయితే.. మీరు క‌చ్ఛితంగా ఈ విష‌యాన్ని చ‌ద‌వాల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కూ టూవీల‌ర్ న‌డిపే వారు హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి అన్న రూల్ ని అమ‌లు చేయ‌టానికి ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కిందామీదా ప‌డుతున్న ప‌రిస్థితి. అలాంటిది.. బండి న‌డిపే వాళ్లే కాదు.. బండి వెనుక సీట్లో కూర్చున్న వారు కూడా హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి అన్న నిబంధ‌న త్వ‌ర‌లో రానుంది. దీనికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు నియ‌మించిన ఉన్న‌త స్థాయి క‌మిటీ త‌న తాజా నివేదిక‌లో బండి మీద వెళ్లే ఇద్ద‌రూ హెల్మెట్ పెట్టుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కోరుతోంది.

ర‌హ‌దారి భ‌ద్ర‌త వ్య‌వ‌హారాల్ని ప‌ర్య‌వేక్షించేందుకు పూర్తిస్థాయి అధికారుల‌తో ఒక ఏజెన్సీ ఏర్పాటు చేయాల‌ని.. ఈ బాధ్య‌త‌ల్ని వారికి మాత్ర‌మే అప్ప‌గించాల‌ని కోరింది. ఈ బాధ్య‌త నిర్వ‌ర్తించే వారికి మ‌రెలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌కుండా ఈ అంశాల్ని మాత్ర‌మే చూసేలా చూడాల‌ని కోరింది. క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల్ని అన్నీ రాష్ట్రాలు అమ‌లు చేయాల‌ని నివేదించింది.

ఈ నివేదిక‌పై రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కిందామీదాప‌డుతున్నాయి. ఇప్ప‌టికే సిబ్బంది కొర‌త‌ను ఎదుర్కొంటున్న ప్ర‌భుత్వాలు.. తాజా నిబంధ‌న‌ల్ని అమ‌లు చేయ‌టానికి పెద్ద ఎత్తున సిబ్బంది అవ‌స‌ర‌మ‌వుతార‌ని.. ఈ విష‌యాన్ని ఎలా అధిగ‌మించాల‌న్న‌ది ఇప్పుడు వారికో స‌మ‌స్య‌గా మారింది. క‌మిటీ చెప్పిన‌ట్లుగా చ‌ట్టాన్ని మారిస్తే.. టూ వీల‌ర్ మీద ప్ర‌యాణం అంత సింఫుల్ కాద‌నే చెప్పాలి. డ్రైవింగ్ చేసే వారితో పాటు.. వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి అంటే.. టూ వీల‌ర్ మీద ప్ర‌యాణించే వారికి కొత్త తిప్ప‌లు షురూ అయిన‌ట్లే.