Begin typing your search above and press return to search.

‘కర్ణాటక ప్రజాస్వామ్యం’.. న్యాయమే గెలిచింది..

By:  Tupaki Desk   |   20 May 2018 10:35 AM GMT
‘కర్ణాటక ప్రజాస్వామ్యం’.. న్యాయమే గెలిచింది..
X
కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.. నిజమే ప్రజాస్వామ్యం గెలిచింది.. కానీ గెలిపించింది మాత్రం న్యాయస్థానాలే.. దేశ అత్యున్నత న్యాయస్థానమే ప్రజాస్వామ్యాన్ని ఈసారి మట్టుకు బతికించింది.

ఎన్నో తీర్పులు, ఎన్నో వక్రభాష్యాలు.. కేంద్రానికి అనుకూలంగా నిర్ణయాలు.. ఏకంగా భారత దేశ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపైనే అభిశంసన వచ్చింది. న్యాయవ్యవస్థపై ఇంత దారుణమైన ఆరోపణలు ఇంతకుముందెన్నడూ రాలేదు.. న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదంటూ మీడియాకు ఎక్కడం స్వతంత్ర్య భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు.. దీంతో కర్ణాటకలో అధికారం హస్తగతం విషయంలో న్యాయవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కానీ చివరకి న్యాయమే గెలిచింది.

కర్ణాటకలో గవర్నర్ వాజుభాయ్ మెజార్టీ లేకున్నా బీజేపీకి అధికారం కట్టబెట్టినప్పుడు కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. సుప్రీం కోర్టును బీజేపీ గద్దెనెక్కడాన్ని సమర్ధించింది. కానీ బేరాసరాలకు ఆస్కారం ఇచ్చేలా 15 రోజుల గడువు ఇవ్వడాన్ని మాత్రం తప్పు పట్టింది. వెంటనే జరపాలని శనివారం బలపరీక్షకు ఆదేశించింది. ఇదే కర్ణాటకలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి ఆస్కారం కల్పించింది. సుప్రీం నిర్ణయంతో బీజేపీ మెజార్టీ లేకపోవడంతో వైదొలిగింది. యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గద్దెనెక్కబోతోంది. సుప్రీం తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. బలపరీక్షకు వెంటనే ఆదేశించి దేశంలో ఇంకా న్యాయం ఉందని సుప్రీం కోర్టు నిరూపించింది. కునారిల్లుతున్న ప్రజాస్వామ్యానికి మళ్లీ ఊపిరిపోసింది..