ఆధార్ కు సుప్రీంకోర్టు జై

Wed Sep 26 2018 14:03:20 GMT+0530 (IST)

ఆధార్ కార్డు చెల్లుబాటుపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు సుప్రీంకోర్టు తెరదించింది. ఆధార్ రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది. జాతీయ గుర్తింపు కార్డుగా దాన్ని పేర్కొంది. సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు కార్డు ఆధార్ తోనే సాధ్యమైందని తెలిపింది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం మెజారిటీ తీర్పును జస్టిస్ ఏకే సిక్రి చదివి వినిపించారు.ఆధార్ తో నకిలీల సమస్య తొలిగిపోయిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆధార్ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని.. ఇది పౌరులకు ఏకైక గుర్తింపు కార్డును అందజేసిందని వెల్లడించింది. ఆధార్ వల్ల వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లుతోందని - హ్యాకింగ్ జరుగుతోందని పిటిషనర్లు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. అలాంటి ముప్పులేవీ లేవని ప్రభుత్వం తమకు స్పష్టం చేసినట్లు తెలిపింది. అయితే రాష్ట్రాలు సహా ప్రైవేట్ సంస్థలు - మొబైల్ కంపెనీలు ఆధార్ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్ సమాచారాన్ని ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది.

మరోవైపు - బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మొబైల్ కనెక్షన్లకు కూడా ఆధార్ అవసరం లేదని చెప్పింది. పాఠశాల అడ్మిషన్లకు - సీబీఎస్ ఈ - నీట్ - యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఈ కార్డు అక్కర్లేదని కోర్టు స్పష్టంచేసింది. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడానికి - పాన్ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలని కోర్టు తెలిపింది.