కాంగ్రెస్ ను దానం భలే ఇరికించేశాడే!

Fri Nov 09 2018 22:09:03 GMT+0530 (IST)

సుదీర్ఘ కసరత్తు - ఆశావహుల వడబోత అనంతరం.. అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు ‘హస్తం’ సిద్ధమైంది. ఎవరెవరు ఎక్కడెక్కడినుంచి బరిలోకి దిగుతారో దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల ద్వారా జరుగుతున్న సమాచారంతో అటు ఆశావహుల్లో - ఇటు కేడర్ లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీచేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో కాంగ్రెస్ - మహాకూటమి నాయకులతో రాహుల్ గాంధీ జనగామ సీటుపై గురువారం చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియాలోనూ జనగామ స్థానం కోదండరాంకే అనే ప్రచారం సాగడంతో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఆయన అనుచరుల్లో టెన్షన్ నెలకొంది. బీసీలకు అన్యాయం జరిగిందనే వ్యాఖ్య తెరమీదకు వచ్చింది.కాగా ఈ పరిణామాన్ని టీఆర్ ఎస్ ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు - కార్యకర్తలు ఈ రోజు టీఆర్ ఎస్ నాయకుడు దానం నాగేందర్ సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎ కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పదవి ఆశించి టీఆర్ ఎస్ పార్టీలో చేరలేదని - పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రం ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలను టీఆర్ ఎస్ వైపు ఆకర్షిస్తున్నాయని తెలిపారు. కాగా ఏకకాలంలో ఇటు టీఆర్ ఎస్ లో అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా మరోవైపు కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం ఆ పార్టీ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.