Begin typing your search above and press return to search.

స్మార్ట్ ఫోన్ల తర్వాతేంటో చెప్పిన పిచాయ్

By:  Tupaki Desk   |   30 April 2016 5:24 AM GMT
స్మార్ట్ ఫోన్ల తర్వాతేంటో చెప్పిన పిచాయ్
X
నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ నిద్ర పోయే వరకూ మనిషి చుట్టూ స్మార్ట్ ప్రపంచమే. చేతిలో స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి అన్నింటిలోనూ స్మార్ట్ కనిపించక మానదు. మరి.. ఇప్పుడు చేతిలో దర్శనమిస్తున్న స్మార్ట్ ఫోన్ తర్వాతి దశ ఏమిటి? ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్.. ల్యాప్ టాప్ తర్వాతి వెర్షన్ ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఏ విధంగా ఉండనుంది? లాంటి ప్రశ్నలు సర్వసాధారణం. కానీ.. వీటికి చాలామంది చాలా సమాధానాలు చెప్పినా.. గూగుల్ సీఈవో చెప్పే భవిష్యత్ దర్శనం ఆసక్తికరంగానే కాదు.. నమ్మొచ్చు సుమా అనిపించటం ఖాయం.

తాజాగా అలాంటి ప్రయత్నాన్నే చేశారు గూగుల్ సీఈవో.. ప్రవాస భారతీయుడు సుందర్ పిచాయ్. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ల అయుష్షు తీరిపోయే రోజు దగ్గర్లోనే ఉందట. కంప్యూటర్ ను భౌతికంగా కాకుండా.. మరో రూపంలో ఉంటుందన్న భావనను వ్యక్తం చేశారు. రోజువారీ కార్యకలపాల్లోసాయం చేసే కంప్యూటర్ కంటికి కనిపించకుండా ఉండే వీలుందని వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేశారు సుందర్ పిచాయ్.

స్మార్ట్ ఫోన్.. టచ్ స్ర్కీన్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఉత్పత్తులు పెరుగుతాయని.. అవేవీ కంటికి కనిపించవని చెప్పుకొచ్చారు. మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు. మరి.. అలాంటి చిత్రమైన రోజులు ఎప్పుడొస్తాయో..?