Begin typing your search above and press return to search.

మోదీకి మరింత ఆత్మవిశ్వాసం ఈ అవిశ్వాసం

By:  Tupaki Desk   |   18 July 2018 11:29 AM GMT
మోదీకి మరింత ఆత్మవిశ్వాసం ఈ అవిశ్వాసం
X
కేంద్రంపై తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చకు లోక్ సభ స్పీకర్ అంగీకరించారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరగనుంది. సభలో శుక్రవారం జరగాల్సిన ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా అవిశ్వాసంపై చర్చకే కేటాయించారు. ఈ మేరకు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి శుక్రవారం పూర్తి సభాసమయం అవిశ్వాసంపై చర్చ చేపట్టేందుకే లోక్ సభ స్పీకర్ నిర్ణయించారు.

దీంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంనుంచి గట్టెక్కుతుందా అనే చర్చ ప్రారంభమైంది. లోక్‌సభలో ప్రస్తుతం మొత్తం సీట్లు 543 కాగా ఖాళీలు పోను ప్రస్తుతం సభలో 535 మంది సభ్యులున్నారు. అంటే ఎన్డీయే ప్రభుత్వానికి 268 మంది సభ్యుల మద్దతు ఉంటే చాలు అవిశ్వాసం నుంచి గట్కెక్కొచ్చన్నమాట. బీజేపీకి సొంతంగా 273 మంది సభ్యులు ఉండడంతో అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం వారికి కష్టమేమీ కాదని స్పష్టమవుతోంది.

సభలో సభ్యుల బలాబలాలు చూస్తే 273 మంది సభ్యులతో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉంది. 48 మంది సభ్యులతో కాంగ్రెస్ ఆ తరువాత స్థానంలో ఉంది. అన్నాడీఎంకేకు 37 మంది, తృణమూల్ కాంగ్రెస్ కు 34 మంది, బిజూ జనతాదళ్‌కు 20 మంది, శివసేనకు 18 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీ 16 మంది సభ్యులతో ఆ తరువాత స్థానంలో ఉంది. అయితే... ఇందులో ఏపీ నుంచి సభ్యులుగా ఉన్నవారు 15 మంది మాత్రమే.. ఒకరు తెలంగాణకు చెందిన మల్లారెడ్డి. ఆయన అనంతర కాలంలో టీఆరెస్‌లో చేరారు. ప్రస్తుతం టీఆరెస్ టీడీపీ అవిశ్వాసానికి మద్దతు తెలపకపోవడంతో ఆయన ఓటు టీడీపీకి పడదని స్పష్టమైపోయింది. అయితే.. వైసీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు ఎంపీల మద్దతు టీడీపీకి ఉంది. ఇక తెలుగు దేశం పార్టీ తరువాత స్థానంలో 11 సీట్లతో టీఆరెస్ ఉంది. సీపీఎంకు 9 సీట్లున్నాయి. ఇక మిగతా పార్టీలు దేనికీ రెండంకెల స్థానాలు లేనేలేవు.

ఇక కూటమిగా లెక్కేస్తే పాలక ఎన్డీయే కూటమికి 314 మంది సభ్యుల బలం ఉంది. విపక్ష యూపీయే కూటమి బలం కేవలం 66 మాత్రమే. ఈ రెండు కూటమిల్లోనూ లేని పార్టీల బలం 153. ఖాళీగా ఉన్న సీట్లు 9. దీంతో ఎలా చూసుకున్నా.. బీజేపీ ఒంటరిగానైనా.. కూటమిగానైనా ఈ అవిశ్వాసం నుంచి సులభంగా గట్కెక్కగలదని స్పష్టమవుతోంది. దీంతో మోదీ ప్రభుత్వానికి మరింత ఆత్మవిశ్వాసం కల్పించడం కోసమే ఈ అవిశ్వాసం పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.