Begin typing your search above and press return to search.

వ‌ర్త‌మాన‌మే మాట్లాడాలంటే..మోడీ టీ మాట‌లెందుకు?

By:  Tupaki Desk   |   20 July 2018 8:37 AM GMT
వ‌ర్త‌మాన‌మే మాట్లాడాలంటే..మోడీ టీ మాట‌లెందుకు?
X
మోడీ స‌ర్కారుపై ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌ను ప్రారంభించిన ఏపీ టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. ప‌దునైన వాద‌న‌ను వినిపించారు. ఏపీ రాష్ట్ర విభ‌జ‌న చేసిన విధానంతో పాటు.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మోడీ స్వ‌యంగా ఇచ్చిన హామీల‌ను గుర్తు చేసే క్ర‌మంలో ఆవేశంతోనూ.. ఆగ్ర‌హంతోనూ.. ఆవేద‌న‌తోనూ ప్ర‌సంగించారు.

సుత్తి లేకుండా సూటిగా మాట్లాడిన గ‌ల్లా జ‌య‌దేవ్.. బోలెడ‌న్ని అంకెల్ని ప్ర‌స్తావించినా.. బోర్ కొట్ట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు క‌నిపించింది. ప‌లు సంద‌ర్భాల్లో గ‌తాన్ని గుర్తు చేస్తూ మోడీని.. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీని తూర్పార ప‌ట్టారు. ఒక‌దశ‌లో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ సైతం గ‌తం మాట‌ల‌కు ఇబ్బందికి గురైన‌ట్లు క‌నిపించింది.

గ‌తం ఎందుకు?.. వ‌ర్త‌మానం గురించి మాట్లాడండి అంటూ ఆమె నోటి నుంచి మాట‌లు వ‌చ్చాయి. అయితే.. తాను మాట్లాడిన మాట‌లు అతికేలా లేవ‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లున్నారు.. మ‌ళ్లీ ఆమె ఆ మాట‌ల్నిమాట్లాడ‌లేదు.

అదే స‌మ‌యంలో స్పీక‌ర్ నోటి నుంచి వ‌చ్చిన గ‌తం ముచ్చ‌ట ఎందుకు? వ‌ర్త‌మానం మాట్లాడ‌న్న మాట‌ను గ‌ల్లా సీరియ‌స్ గా తీసుకోకుండా వ‌దిలేశారు.

కానీ.. గ‌తమే వ‌ర్త‌మానానికి ప్రామాణిక‌మ‌వుతుంద‌ని.. అదే భ‌విష్య‌త్తు పునాది అవుతుంద‌న్న చిన్న విష‌యాన్ని స్పీక‌ర్ స్థానంలో ఉన్న సుమిత్ర‌మ్మ ఎలా మ‌ర్చిపోయారు. ఈ గ‌త‌మే మోడీని ప్ర‌ధాన‌మంత్రిని చేసింద‌ని మ‌ర్చిపోకూడ‌దు. తాను రైల్వేస్టేష‌న్లో టీ అమ్మే వాడినంటూ త‌న గ‌తాన్ని అంద‌రికి తెలిసేలా చేయ‌ట‌మే కాదు.. ఆ గ‌తంలోని పేద‌రికాన్ని ప్ర‌స్తావిస్తూ.. తాను ఆమ్ ఆద్మీల‌కు ప్ర‌తినిధిగా అభివ‌ర్ణించుకోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. టీ అమ్మే వాడు ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో కూర్చునే అర్హ‌త లేదా? అంటూ గ‌తాన్ని గొప్ప‌గా చెప్పుకోవ‌ట‌మే వ‌ర్త‌మానానికి క‌లిసి వ‌చ్చి.. ఆయ‌న్ను పీఎంను చేసింద‌ని మ‌ర‌చిపోకూడ‌దు.

ఒక‌వేళ‌.. గ‌తాన్ని ప్ర‌స్తావించ‌టం ఎందుకు? వ‌ర్త‌మానం గురించి మాట్లాడాల‌న్న స్పీక‌ర‌మ్మ మాట‌నే సీరియ‌స్ గా తీసుకుంటే.. ప్ర‌ధాని మోడీ నోటి నుంచి టీ అమ్మే మాట అస్స‌లు రాకూడ‌దు. వాస్త‌వానికి స్పీక‌ర‌మ్మ చెప్పిన‌ట్లే చేయాల్సి వ‌స్తే.. మోడీ మాట‌ల కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. గ‌తాన్ని ప్ర‌స్తావిస్తూనే ఆయ‌న మాట‌ల‌న్నీ ఉంటాయి మ‌రి.