టికెట్ కోసం మరో సినీ నటుడి ప్రయత్నం

Sun Sep 23 2018 15:50:53 GMT+0530 (IST)

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేసీఆర్ - ఉత్తమ్ - రమణ ఇలా రాజకీయ నేతలు వాడివేడిగా పోటీలపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇంత వేడి ఉన్నా తెలంగాణలోని హైదరాబాద్ లో ఉండే సీనీ ప్రముఖులు ఎవ్వరూ తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే తెలంగాణలో సినీ ప్రముఖులకు గ్లామర్ తక్కువే.. పోటీచేసినా గెలవడం అంతా ఈజీ కాదు. అదే సమయంలో ఏపీలో సినీ గ్లామర్ ఎక్కువ. అక్కడ సినీ ప్రముఖులను నెత్తిన పెట్టుకుంటారు.ఇప్పటికే టీడీపీ తరఫున బాలక్రిష్ణ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. అటు వైసీపీలో ఎమ్మెల్యే రోజా ఆ పార్టీకి సినీ గ్లామర్ పంచారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేయడానికి మరో సినీ స్టార్ రెడీ అవుతున్నాడట.. ఆయనే సుమన్. ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమన్ కు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య సుమన్ కూడా ఏపీలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. 2019లో పోటీచేసే  ఉద్దేశంతోనే సుమన్  ఎక్కువగా ప్రజల్లోకి వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి సుమన్ రెడీ అవుతున్నట్టు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట..

గుంటూరు జిల్లా రేపల్లె నుంచి సుమన్ పోటీచేయబోతున్నారనే వార్త ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారిందట.. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఈడె మురళీ కృష్ణ సుమన్ అభిమాని. చంద్రబాబు తమ అభిమాన నేత అని చెప్పే సుమన్.. ఇలా తన అభిమాని ఉన్న రేపల్లె నుంచి పోటీకి సిద్దమయ్యాడట..

2014లో రేపల్లెలో టీడీపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఈసారి పోటీచేసేది తానే.. గెలిచేది తానేనని బళ్ల గుద్దిచెబుతున్నారట.. వరుసగా మూడు సార్లు గెలిచిన మోపిదేవి వెంకటరమణను గత ఎన్నికల్లో సత్య ప్రసాద్ ఓడించాడు. అయితే రేపల్లెలో అందుబాటులో ఉండరనే విమర్శ సత్యప్రసాద్ పై బలంగా ఉందట..

రేపల్లెలలో గౌడ - మత్స్యకార సామాజికవర్గాలు బలంగా ఉన్నాయట.. సత్యప్రసాద్ గౌడ్ అయితే.. మోపిదేవి మత్స్యకార సామాజిక వర్గం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగడానికి మోపిదేవి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ పోటీ పడతాననే ఆలోచన సత్యప్రసాద్ లో ఆందోళన పెంచుతోందట.. సత్యప్రసాద్ అందుబాటులో లేని వైనంతోపాటు సుమన్ ను బరిలోకి దింపాలని అక్కడి కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపిస్తోందట.. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి చంద్రబాబు..  సుమన్ కు టికెట్ ఇస్తారా.?  సినీ గ్లామర్ కోసం సుమన్ ను స్వాగతిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.