Begin typing your search above and press return to search.

బాబు గారూ... ఈ జ‌గ‌న్ ఆవేద‌న విన్నారా?

By:  Tupaki Desk   |   24 Jun 2017 4:25 AM GMT
బాబు గారూ... ఈ జ‌గ‌న్ ఆవేద‌న విన్నారా?
X
ఏపీలో అధికార టీడీపీ చేస్తున్న ఆరాచ‌కాల‌పై ఇప్ప‌ట‌కే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలుపెర‌గ‌ని పోరు సాగిస్తున్నారు. ప్ర‌భుత్వం సాగిస్తున్న అప‌స‌వ్య పాల‌న‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ధ‌ర్నాలు - దీక్ష‌ల పేరిట జ‌గ‌న్ చేస్తున్న పోరాటంతో టీడీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌న్న విష‌యం తెలిస్తేనే... జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తున్న అంశాల‌పై అప్ప‌టిక‌ప్పుడు ఫైళ్లు తిర‌గేసి నామ్‌ కేవాస్తే చ‌ర్య‌లు చేప‌డుతోంది. అయితే చంద్ర‌బాబు స‌ర్కారు హ‌యాంలో వ‌సూళ్ల దందా ఏ స్థాయికి చేరిపోయిందో చెప్పేందుకు మ‌రో జ‌*గ‌న్‌* దూసుకువ‌చ్చేసింది.

ఈ జ‌గ‌న్ ఏ రాజ‌కీయ పార్టీకో చెందిన వారు కాదు... బాబు అధికార యంత్రాంగంలో ఓ చిన్న‌స్థాయి అధికారి. ఆయ‌నే శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పోలీస్ స్టేష‌న్ లో ఎస్సైగా ప‌నిచేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రావు. కొన్ని రోజుల క్రితం ఆయ‌న నేరుగా జిల్లా క‌లెక్ట‌ర్‌ కు రాసిన ఓ లేఖ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారిపోయింది. ఓ ఎస్సైగా ఉండి... జిల్లా ఎస్పీకో - రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీకో లేఖ రాయాల్సిన ఆయ‌న‌... నేరుగా క‌లెక్ట‌ర్‌ కు లేఖ రాశారంటేనే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇక జ‌గ‌న్ రాసిన లేఖ విష‌యానికి వ‌స్తే... త‌న శాఖ‌లోని ఉన్న‌తాధికారులు - అధికార పార్టీ నేత‌ల‌కు వ‌సూళ్లు చేసి పెట్ట‌డం త‌న‌కు త‌ల‌కు మించిన భారంగా మారింద‌ని, నెల‌కు అక్ష‌రాల కోటి రూపాయ‌ల‌ను త‌న‌కు టార్గెట్‌ గా పెట్టార‌ని, ఇది త‌న వ‌ల్ల కావ‌డం లేద‌ని, ఈ వ‌సూళ్ల ప‌ర్వం నుంచి త‌న‌కు విముక్తి క‌ల్పించాల‌ని జ‌గ‌న్ ఆ లేఖ‌లో కలెక్ట‌ర్‌ ను కోరారు. ఈ వ‌సూళ్ల కోసం ఇసుకాసురుడి అవ‌తారం ఎత్తాల్సి వ‌స్తోందని, అడ్డ‌మైన ప‌నుల‌న్నీ చేయాల్సి వ‌స్తోంద‌ని, స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని స్టేష‌న్ కు వ‌చ్చే వారి నుంచి వ‌సూళ్లు చేయాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న ఆ లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా ఈ వ‌సూళ్ల దందాను భుజాన వేసుకోవ‌డం త‌న‌కు భారంగా మారింద‌ని, ఇక‌పై ఈ దందాను తాను న‌డిపించ‌లేనని కూడా ఆయన వాపోయారు.

దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన ఆ క‌లెక్ట‌ర్‌... ఆ ప‌నిని ప‌క్క‌న పెట్టేసి జ‌గ‌న్ రాసిన లేఖ‌ను నేరుగా ఆయ‌న పై అధికారి అయిన జిల్లా ఎస్పీకి ఫార్వ‌ర్డ్ చేశార‌ట‌. దీంతో జ‌గ‌న్ కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. లేఖ జిల్లా ఎస్పీ కార్యాల‌యం చేరిపోయిన మ‌రుక్ష‌ణ‌మే జ‌గ‌న్ పోస్టింగ్ ఊడిపోయింది. సూళ్లూరుపేట స్టేష‌న్ నుంచి ఆయ‌న‌ను బ‌దిలీ చేస్తూ.. ఎక్క‌డ కూడా పోస్టింగ్ ఇవ్వ‌కుండా వేకెన్సీ రిజ‌ర్వ్ (వీఆర్‌)లో పెట్టేశారు. ఏదేనీ పొర‌పాటు చేసిన అధికారుల‌ను కొంత‌కాలం పాటు వీఆర్‌లో పెట్ట‌డం చూశాం గానీ... అవినీతికి చ‌ర‌మ‌గీతం పాడాల‌ని కోరిన అధికారిని ఇలా వీఆర్‌ లో పెట్ట‌డం నిజంగా చోద్య‌మని చెప్పాలి. నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారిన ఈ లేఖ‌పై రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/