Begin typing your search above and press return to search.

టీడీపీలో ఆ ఇద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్‌

By:  Tupaki Desk   |   20 July 2016 5:30 PM GMT
టీడీపీలో ఆ ఇద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్‌
X
టీడీపీ కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి - ఆ పార్టీ సీనియ‌ర్ నేత - ఢిల్లీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహ‌న్‌ రావు మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ల మ‌ధ్య వార్ ఎందుక‌ని వ‌ర్రీ అవుతున్నారా? రాజ‌కీయం అన్నాక‌ - ముఖ్యంగా ప‌ద‌వులన్నాక ఎవ‌రు ఎవ‌రికైనా ఎర్త్ పెట్టొచ్చు. ఇక విష‌యానికి వ‌చ్చే స‌రికి.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ - టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ ఎమ్మెల్యేల‌కు రాష్ట్ర మంత్రివర్గంలో చంద్ర‌బాబు చోటు కల్పించారు. అదేవిధంగా టీడీపీ ఎంపీలు ఇద్ద‌రికి ప్ర‌ధాని మోడీ త‌న కేబినెట్‌ లో స్థాన‌మిచ్చారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు టీడీపీకి చెందిన కంభంపాటికి మ‌రో అరుదైన చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర అవ‌స‌రాల‌కు సంబంధించి ఢిల్లీలో గ‌ళం వినిపించేలా ఓ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ త‌ర‌ఫున.... ముఖ్యంగా త‌న వ్యూహాల‌కు అనుగుణంగా ఢిల్లీలో ఉంటే బాగుంటుంద‌ని చంద్ర‌బాబు భావించారు.

దీంతో ఆయ‌న కంభంపాటిని ఢిల్లీలో ఏపీ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా నియ‌మించారు. అయితే, ఇది రెండేళ్ల ప‌ద‌వి కావ‌డంతో ఇటీవ‌ల ప‌ద‌వీకాలం ముగిసింది. ఇదే స‌మ‌యంలో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి ప‌ద‌వీ కాలం కూడా ముగిసింది. దీంతో అటు కంభంపాటిని - ఇటు సుజ‌నా చౌద‌రిని తిరిగి వారి వారి స్థానాల్లో ఎన్నుకోవ‌డ‌మా? లేక మార్చ‌డ‌మా? ఏదో ఒక‌టి చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇదే రాజ‌కీయంగా పెద్ద వార్‌ కు దారి తీసింది. త‌న‌కు ప్ర‌త్యేక ప్ర‌తినిధి ప‌దివి క‌న్నా టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని ప‌రోక్షంగా కంభంపాటి త‌న ప్ర‌య‌త్నాలు తాను చేశారు. అంటే సుజ‌నా ప‌ద‌వికి ఈయ‌న ఎస‌రు పెట్ట‌బోతున్నాడ‌ని సుజ‌నా వ‌ర్గం గ్ర‌హించింది. అయితే, సుజ‌నా మాత్రం తిరిగి రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని గట్టిగా నిర్ణ‌యించుకుని ఇటు వైపు నుంచి త‌న ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. అయితే, కంభంపాటి మాత్రం సుజ‌నాకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశార‌నే క‌ల‌క‌లం రేగింది.

ఈ క్రమంలో అసలు రాజకీయం మొదలైంది. పార్టీలో ముఖ్యుల వద్ద ఎవరి వాదనలు వారు వినిపించారు. ఆ క్రమంలో తనకు పదవి ఇవ్వాలని కోరడంతో పాటు... అవతలి వారికి ఎందుకు ఇవ్వకూడదన్న దానిపై కూడా ఇరువురు ఎవరి స్టైల్లో వారు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో కంభంపాటి తనకు కౌంటర్ గా చేసిన ప్రచారం సుజనాకు ఇబ్బంది కలిగించింది. చివరి నిముషం వరకు రెన్యూవల్ పై క్లారిటీ రాలేదు. దీంతో సుజనా కాస్త అసహనానికి లోనయ్యారు.

మొత్తం మీద సుజనాకు మ‌రోసారి రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ అయినా కంభంపాటి వ్యవహారాన్ని లైట్‌ గా తీసుకోలేక‌పోయారు. ఇప్పుడు తాను ఒడ్డు దాటాడు కాబ‌ట్టి కంభంపాటి ప‌ని ప‌ట్టాల‌ని నిశ్చ‌యించుకున్నార‌ట సుజ‌నా. కంభంపాటిని రెండో సారి ప్ర‌త్యేక ప్ర‌తినిధి పోస్టుకు పంప‌కుండా అడ్డుప‌డాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుని, త‌న‌కు ఇష్ట‌మైన వారి పేర్ల‌ను ఈ ప‌ద‌వికి ఆయ‌న సిఫార్సు చేస్తున్నార‌ట‌. తనను ఇబ్బంది పెట్టిన కంభంపాటికి ఢిల్లీలో పదవి లేకుండా చేయాలన్న పట్టుదలతో సుజనా ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.

సుజ‌నా - కంభంపాటిల మ‌ధ్య గ్యాప్ విష‌యం సీఎం చంద్ర‌బాబు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయ‌న వీరిద్ద‌రికీ ప‌రోక్షంగా స‌మ‌న్వ‌యం ఉండాల‌ని వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. మ‌రి ఇప్పుడు ఈ ర‌గ‌డ చ‌ల్లార్చేలా చంద్ర‌బాబు ఇరువురు నేత‌ల మ‌ధ్య ఏవిధంగా రాజీచేస్తారో చేడాలి. అదేవిధంగా కంభంపాటిని తిరిగి ఎన్నుకోవ‌డం ద్వారా నేత‌ల‌ను బ్యాలెన్స్ చేస్తారా చూడాలి. అన్న విష‌యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.