Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో ఆ ఇద్ద‌రికి చెడిందా..!

By:  Tupaki Desk   |   18 Sep 2019 8:22 AM GMT
ఏపీ బీజేపీలో ఆ ఇద్ద‌రికి చెడిందా..!
X
బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి - టీజీ వెంక‌టేశ్ కు మ‌ధ్య స్నేహం చెడిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇదే విష‌యం ఇప్పుడు ఏపీ బీజేపీ వ‌ర్గాల్లో ట్రెండ్ అవుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్ప‌టికీ నేత‌లిద్ద‌రూ త‌లోదారిలో న‌డుస్తున్నారు. గ‌తంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి - టీజీ వెంక‌టేశ్ తోపాటు సీఎం ర‌మేశ్‌ - గ‌రిక‌పాటి మోహ‌న్ రావు ఆపార్టీకి రాజీనామా చేసి - బీజేపీలో చేరారు. వీరిలో టీజే వెంకటేశ్‌ కి సుజనా చౌదరికి నడుమ మంచి స్నేహం ఉంది. ఆ స్నేహమే అయిష్టం అయినా వెంకటేశ్‌ ను గోడదూకేసేలా చేసింది.

పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తమపై వేటు వేయకుండా ఉండాలంటే జంప్ చేయడానికి సుజ‌నాకు టీజీ వెంక‌టేశ్ మద్దతు తప్పలేదు. దీంతో ఆయన బలవంతంగా తన‌ మిత్రుడితో కూడా బీజేపీకి జై కొట్టిం చేశారు. ఈ విషయాన్ని వెంకటేశ్ సైతం బాహాటంగానే అంగీకరించారు కూడా. ఇంత స‌ఖ్య‌త‌గా ఉన్న ఆ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య స్నేహం ప్ర‌స్తుతం చెడిన‌ట్లే క‌నిపిస్తోంది. ఏపీ రాజ‌ధాని అంశంపై నేత‌లిద్ద‌రూ ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ నుంచి రెండు గొంతులు వినిపిస్తుండటం చర్చనీయాంశం గా మారింది.

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండి తీరాలని సుజనా చౌదరి డిమాండ్ చేస్తుండ‌గా - వెంకటేష్ మాత్రం రాయలసీమను రాజధాని చేయాల‌ని కోరుతున్నారు. చంద్రబాబు తాత్కాలిక రాజధాని కట్టారంటే అసలు రాజధాని లేనట్టేగా అంటున్నారు టీజీ వెంకటేశ్‌. అంతే కాదు రాజధాని మార్చే ఉద్దేశ్యం లేకపోతే కనీసం రెండో రాజధాని చేయాలని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. టీజీ అంశం బీజేపీలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్‌ మ‌ధ్య‌ విభేదాల వల్లే ఒకే పార్టీ నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే కమలం పార్టీ వ్యూహంలో భాగంగానే టీజీ వెంకటేశ్ ఇలా మాట్లాడుతున్నాడ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఏపీ బీజేపీలో ఇప్ప‌టికే పాత నేత‌లు వ‌ర్సెస్ కొత్త నేత‌ల మ‌ధ్య గ్రూపుల గోల న‌డుస్తుంటే.. ఇప్పుడు కొత్త నేత‌ల్లోనే మ‌ళ్లీ నేత‌లు రెండు - మూడు వ‌ర్గాలుగా చీలిపోతుండ‌డంతో ఏపీలో బీజేపీ కేవ‌లం నాయ‌కుల పార్టీగానే మిగిలిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.