జగన్ కు సుజనా అండ..రాజధానిపై ఆందోళన అక్కర్లేదట!

Sat Aug 24 2019 20:32:01 GMT+0530 (IST)

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మార్పునకు సంబంధించి నిన్న గాక మొన్న తనదైన శైలిలో విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రెండు రోజులు తిరక్కుండానే మాట మార్చేశారు. మొన్న జగన్ కేబినెట్ లోని కీలక మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన ప్రకటనపై నిప్పులు చెరిగిన సుజనా... జగన్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. అంతెత్తున మండిపడ్డ సుజనా... రెండు రోజులు కూడా తిరక్కుండానే మాట మార్చేశారు. రాజదాని మార్పునకు సంబంధించి జగన్ నోట నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదని - ఈ నేపథ్యంలో రాజదానిని మార్చేస్తారన్న ఆందోళన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోనే సుజనా చెప్పిన ఈ మాట ఇప్పుడు నిజంగానే ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.రాజధాని అమరావతిపై తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోదంటూ బొత్స చేసిన ప్రకటనపై ఇటు టీడీపీ తనదైన శైలిలో విరుచుకుపడితే... అంతకుమించిన రేంజిలో సుజనా ఫైరైపోయారు. రాజధాని అమరావతిని మార్చేసే దిశగా జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం సరికాదని - అయినా రాజధానిని ఎలా మారుస్తారంటూ కూడా సుజనా ఫైరయ్యారు. జగన్ సర్కారు నిర్ణయాలను ఆయన అనాలోచిత నిర్ణయాలుగానే సుజనా అభివర్ణించారు. అసలు రాజధానిని అమరావతి నుంచి మార్చరాదని కూడా ఆయన డిమాండ్ చేశారు. సుజనా నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు సంచలనంగానే మారాయి. ఇలాంటి క్రమంలో శనివారం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు సుజనాను కలిశారు. తమ ఆందోళనను ఆయన ముందుంచారు. ఈ సందర్భంగా సుజనా రైతుల ఆందోళన తగ్గించేలా - జగన్ సర్కారుకు దాదాపుగా అండగా నిలిచేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సుజనా ఏలాంటి వ్యాఖ్యలు చేశారంటే... రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కూడా సుజనా చెప్పుకొచ్చారు. ఇందుకు గల నేపథ్యాన్ని కూడా సుజనా ప్రస్తావించారు. రాజధానిని అమరావతి నుంచి తరలించే విషయంపై ఓ వైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజధాని తరలింపునకు సంబంధించి జగన్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రానందున రైతులతో పాటు ఏ ఒక్కరు కూడా రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుజనా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ విషయంపై జరుగుతున్న ప్రచారంపై జగన్ సర్కారు మీద తనదైన శైలిలో విరుచుకుపడ్డ సుజనా... ఇప్పుడు జగన్ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకోదని - ఆందోళన చెందాల్సిన అవసరం ఏ ఒక్కరికీ అవసరం లేదంటూ సుజనా చేసిన కామెంట్లను చూస్తుంటే... ఆయన జగన్ కు బాసటగా నిలిచినట్టేనన్న వాదన వినిపిస్తోంది.