Begin typing your search above and press return to search.

నందమూరి సుహాసిని వచ్చిందోచ్..

By:  Tupaki Desk   |   18 Dec 2018 11:47 AM GMT
నందమూరి సుహాసిని వచ్చిందోచ్..
X
అనూహ్య పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల బరి లో నిలిచింది నందమూరి సుహాసిని. హరికృష్ణ కు కూతురుందని.. ఆమె పేరు సుహాసిని అని కూడా సామాన్య జనాలకు తెలియదు. అలాంటి వ్యక్తిని అనూహ్యంగా రాజకీయ ముఖచిత్రం పై తీసుకొచ్చేసింది తెలుగుదేశం పార్టీ. హరికృష్ణ మరణం తాలూకు సానుభూతి ని పార్టీ కోసం ఉపయోగించుకోవడం కోసం అసలు రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన లేని సుహాసినిని తీసుకొచ్చి ఎన్నికల బరిలో నిలిపాడు నారా చంద్రబాబు నాయుడు. ఆమె ను నిలబెట్టడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లను పార్టీ వైపు మళ్లించాలని చూశాడు. కానీ ఆయన ఆలోచన బూమరాంగ్ అయింది. ఎన్నికల్లో సుహాసిని ఘోర పరాజయాన్ని చవిచూసింది. గెలుపు పక్కా అనుకున్న కూకట్ పల్లిలో ఆ స్థాయి పరాభవం ఎవ్వరూ ఊహించనిదే.

ఈ ఓటమి నేపథ్యం లో సుహాసిని మళ్లీ కూకట్ పల్లి వైపు చూడదనే అంతా అనుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండగా.. ట్రెండ్స్ చూసి మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. కానీ ఆమె ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత మళ్లీ కూకట్ పల్లిలోని కేపీహెచ్ బీ కాలనీ లో ప్రత్యక్షం కావడం విశేషం. ఆమె పార్టీ నేతలు.. కార్యకర్తల తో చిన్న సమావేశం నిర్వహించారు. తన కోసం ప్రచారం చేసిన.. కష్టపడిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పారు. ‘‘ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఐతే నన్ను గెలిపించం కోసం శ్రమించిన ప్రతి పార్టీ కార్యకర్తకూ నా ధన్యవాదాలు’’ అని సుహాసిని పేర్కొంది.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. చాలా ఓట్లు గల్లంతయ్యాయని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. ఏదేమైనప్పటికీ.. ఓటమి తర్వాత ఇలా మీటింగ్ పెట్టి కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా తన సంస్కారాన్ని చాటి చెప్పింది సుహాసిని. ఇందుకు ఆమెను అభినందించాల్సిందే.