Begin typing your search above and press return to search.

సర్వే నిజం: డాక్టర్ ను చూసినంతనే బీపీ పెరుగుతోందట!

By:  Tupaki Desk   |   22 Aug 2019 4:52 AM GMT
సర్వే నిజం: డాక్టర్ ను చూసినంతనే బీపీ పెరుగుతోందట!
X
ఒక సంస్థ చేపట్టిన సర్వే షాకింగ్ నిజాల్ని వెల్లడించింది. ఆసుపత్రికి వెళ్లి.. వైద్యుడ్ని చూసినంతనే హడలెత్తిపోవటమే కాదు.. ఆ ఆందోళనతో బీపీ పెరిగిపోవటం ఒక ఎత్తు అయితే.. ఆ బీపీని రోగంగా భావించి మందులు వాడేస్తున్న వైనం ఇప్పుడు వెలుగు చూసింది. తన వద్దకు వచ్చే రోగి బీపీలో వచ్చే మార్పును గుర్తించటంలో వైద్యులు ఫెయిల్ అవుతున్నట్లుగా ఇండియా హార్ట్ స్టడీ సంస్థ నిర్వహించిన సర్వేలో బయటకొచ్చింది.

అప్పటివరకూ మామూలుగా ఉన్న రక్తపోటు.. వైద్యుడ్ని చూసినంతనే పెరగటాన్ని వైద్య పరిభాషలో వైట్ కోట్ హైపర్ టెన్షన్ గా వ్యవహరిస్తారు. అయితే.. ఈ విషయాన్ని రోగులు గుర్తించకపోవటం ఒక ఎత్తు అయితే.. రోగి బీపీలో వచ్చే మార్పు ఎందుకొచ్చిందన్న విషయాన్ని వైద్యుడు సరిగా గుర్తించకుండానే వారికి మందులు ఇచ్చేస్తున్న వైనంతో కొత్త తరహా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా సదరు సర్వే వెల్లడించింది.

దేశంలో రోగులు ఈ తరహా ఇబ్బందిని పెద్దఎత్తున ఎదుర్కొంటున్నారని.. కాలం గడిచే కొద్దీ ఈ తరహా ఇబ్బందిని ఎదుర్కొంటున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు ఇండియా హార్ట్ స్టడీ సంస్థ తేల్చింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న రోగులు 24 శాతం ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య 36 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ఇబ్బందిని ఎదుర్కొంటున్న రోగుల్లో తమిళనాడు మొదటిస్థానంలో నిలిస్తే.. తెలంగాణ 8 స్థానంలో.. ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నట్లుగా వెల్లడించారు.

తాజా సర్వే నేపథ్యంలో బీపీ టెస్ట్ ను ఎలా చేయించుకోవాలన్న అంశంపై కొన్ని సూచనలతో పాటు.. బీపీ సాధారణం కంటే ఎక్కువగా ఉందంటూ మందులు వెంటనే వాడొద్దన్న సలహాను ఇస్తున్నారు. ఆసుపత్రికి వచ్చినంతనే బీపీ పరీక్షలు చేయొద్దని.. ఆసుపత్రికి వచ్చిన 15 నిమిషాల తర్వాత బాధితుడ్ని ప్రశాంతంగా కూర్చొనిచ్చిన తర్వాతే పరీక్ష చేయాలని చెబుతున్నారు.

అంతేకాదు.. ఆసుపత్రి మెట్లు ఎక్కి వచ్చినంతనే టెస్ట్ చేయొద్దని.. రోగి ఆయాసంతోనూ.. ఆందోళనలో ఉన్నప్పుడూ బీపీ టెస్ట్ వద్దంటున్నారు. అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు సరైన ఫలితాలు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. బీపీ 135/85 వరకు ఉంటే ఎలాంటి మందులు వాడకూడదు. బీపీ అంతకు మించి ఉన్నా.. వెంటనే మందులు మొదలుపెట్టకూడదు. తీసుకునే ఆహారం.. జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు.. వ్యాయామం చేయాలే తప్పించి వెంటనే మందుల్ని వాడటం సరికాదని చెబుతున్నారు.

వైట్ కోట్ హైపర్ టెన్షన్ మరీ కంగారు పడాల్సిన రోగ లక్షణం ఎంతమాత్రం కాదని.. అయితే.. ఈ విషయంలో వైద్యుల అవగాహన లోపం కారణంగా రోగికి ఇబ్బంది ఎదురుకావొచ్చని చెబుతున్నారు. సో.. ఆసుపత్రికి వెళ్లినంతనే బీపీ ఎక్కువగా ఉందంటే.. కాసేపు అక్కడే ఉండి.. ప్రశాంత చిత్తంతో మరోసారి పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి అన్న విషయాన్ని మర్చిపోకండి.