Begin typing your search above and press return to search.

తెలంగాణ సచివాలయంలో నిరుద్యోగుల బిక్షాటన

By:  Tupaki Desk   |   17 Oct 2017 4:24 AM GMT
తెలంగాణ సచివాలయంలో నిరుద్యోగుల బిక్షాటన
X
తెలంగాణ ప్ర‌భుత్వానికి నిరుద్యోగుల రూపంలో భారీ సెగ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉద్యోగాల భ‌ర్తీ స‌రిగా సాగ‌డంలేద‌ని, వేసిన నోటిఫికేష‌న్లు కోర్టు కేసుల కార‌ణంగా ఆగిపోతున్నాయ‌ని అభ్య‌ర్థుల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొలువుల‌కై కొట్లాట పేరుతో హైద‌రాబాద్‌ లో భారీ స‌భ నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధమ‌వుతుండ‌టం అధికార టీఆర్ ఎస్ పార్టీని క‌లవ‌రపాటుకు గురిచేస్తోంది. దీనికి కొన‌సాగింపు తాజాగా మ‌రో సంచ‌ల‌న చ‌ర్య‌కు దిగారు. సాక్షాత్తు తెలంగాణ సచివాలయంలో నిరుద్యోగులు బిక్షాట‌న ప్ర‌య‌త్నం చేశారు.

సచివాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీని తెలంగాణ ప్రొఫెషనల్‌ విద్యార్థుల సంఘం కలిసి ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని వాపోయారు. త‌మ‌కు బిక్షాట‌న చేసుకోవ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని విద్యార్థి సంఘం నేత‌లు వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని కొనసాగించేందుకు - భవిష్యత్‌ లో రాజకీయపార్టీ ఏర్పాటుకు భిక్షాటన చేస్తున్నామని విద్యార్థి సంఘం నేత‌లు తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బిక్షాటన చేస్తున్న విద్యార్థులకు స‌ర్దిచెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీకి త‌గు చర్య‌లు తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. అయితే సాక్షాత్తు స‌చివాల‌యంలోనే బిక్షాట‌న‌కు ప్ర‌య‌త్నించ‌డం...అందులోనూ ఉప ముఖ్య‌మంత్రిని ఈ విధంగా అభ్య‌ర్థించ‌డం క‌ల‌క‌లంగా మారింది.