Begin typing your search above and press return to search.

దాయాది మీద మోడీ వార్ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   27 Aug 2016 1:30 AM GMT
దాయాది మీద మోడీ వార్ ప్లాన్ ఇదేనా?
X
ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే? ముఖాముఖిన తలపడటం ఒక పద్ధతి. దొంగచాటుగా దెబ్బ తీయటం మరో పద్ధతి. ఈ రెండింటికి భిన్నంగా అపద్భాందవుడి వ్యవహరిస్తూ అనుకున్న పని పూర్తి చేయటం ఇంకో పద్ధతి. అగ్రరాజ్యాల తీరు చూస్తే మూడోపద్ధతినే ఫాలో కావటం కనిపిస్తుంది. ఇరాక్ లోని చమురు మీద కన్నేసిన అమెరికా.. తన చమురు అవసరాల గురించి అస్సలు మాట్లాడలేదు. దాని గళం ఎప్పుడూ సద్దాం రసాయానిక ఆయుధాల మీదనే ఉండేది. నిజంగానే సద్దాం రసాయినిక ఆయుధాలు తయారు చేశాడా? అంటే.. సమాధానం అందరికి తెలిసిందే. ఇరాక్ మీద యుద్దానికి దిగినప్పుడు చెప్పిన మాటలకు.. తర్వాత జరిగిందేమిటన్నది ప్రపంచానికి తెలిసిందే.

తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అమెరికాకు చెప్పిన మాటను అందరూ విన్నారే కానీ అడ్డు చెప్పింది లేదు. తర్వాత అయినా ఎవరైనా నిలదీశారా? అంటే లేదనే చెప్పాలి. లక్షల మంది చనిపోయినా.. ఎప్పటికి కోలుకోని విధంగా ఇరాక్ మారిపోయినా.. అంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డావంటూ అమెరికాను నిలదీసింది ఎవరూ లేరు. ప్రపంచ పెద్దన్న కాబట్టి అదేం అనుకుంటే అది నడిచిపోతుందని అనుకోవచ్చు. కానీ.. ప్రపంచ రాజకీయాల్ని నిశితంగా గమనిస్తే.. స్పష్టంగా అర్థమయ్యేది ఒక్కటే.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయాలని పట్టుదలతో వ్యవహరించే ధోరణి ఉండటం.. అదే సమయంలో అగ్రరాజ్యాలతో భుజం భుజం రాసుకు పూసుకు తిరిగితే తత్వం ఉంటే చాలు.. ఏం చేసినా నడిచిపోవటం కనిపిస్తుంది.

అగ్రరాజ్యాలకు ఆగ్రహం కలగకుండా.. వారితో సఖ్యతగా వ్యవహరిస్తే వారికి అంతకు మించి కావాల్సిందేమీ ఉండదు. నిజం నిష్టురంగా ఉన్నా అగ్రరాజ్యాలకు కావాల్సింది వ్యాపార ప్రయోజనాలే తప్పించి.. మరింకేమీ కాదన్న విషయం బహిరంగ రహస్యం. ఈ విషయం తెలిసిందే అయినా.. దాయాదికి గట్టి గుణపాఠం చెప్పాలన్న ధైర్యం.. సాహసం.. ఈ మధ్యన ప్రధాని పదవిని చేపట్టిన ఏ నేత చేయలేదనే చెప్పాలి. దాయాది పెట్టే బాధల్ని పంటి బిగువునా భరిస్తూ.. సహనశీలి ట్యాగ్ కట్టుకొన్నట్లుగా కనిపిస్తుంది.

అయితే.. ప్రధాని మోడీ తీరు కాస్త భిన్నం. ఆయన మొండోడు. అదే సమయంలో రాజకీయ చతురత కూడా ఎక్కువ. మాటలు ఎంత తియ్యగా ఉంటాయో.. అందుకు భిన్నంగా చేతల్లో చేసి చూపించే సత్తా ఆయన సొంతం. అందుకేనేమో.. నిత్యం చిరాకు పుట్టిస్తూ.. కంట్లో నలుసులా వ్యవహరిస్తున్న దాయాది విషయంలో మోడీ సీరియస్ నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర సమాధానం లభిస్తుందనే చెప్పాలి.

ఎందుకంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కొందరు చెబుతున్న మాటలు చూస్తే.. దాయాది విషయంలో మోడీ ఆలోచనలు ఏమై ఉంటాయన్న ఊహలకు రెక్కలు తొడిగితే.. రేఖామాత్రంగా కొన్ని విషయాలు అర్థమవుతాయనే చెప్పాలి. గడిచిన కొద్ది వారాలుగా కశ్మీర్ ను నిప్పుల గుండంగా మార్చి ఆ వేడి మంటల్లో చలి కాసుకుంటోన్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో మోడీ ఉన్నట్లుగా కనిపిస్తారు. కోట్లాది రూపాయిలు కుమ్మరిస్తూ కశ్మీర్ లో శాంతి అన్నది లేకుండా చేయాలన్న లక్ష్యంతో పాక్ వ్యవహరిస్తోన్న వైనం ఆయనకు తెలియంది కాదు. అందుకే.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరి.. బలూచిస్థాన్ ప్రజల ఆశలకు.. ఆకాంక్షల్ని తన ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధాని మోడీ.. దూరాన ఉన్న బలూచ్ ఉద్యమకారుల్లో కొత్త ఆశల్ని నింపారు.

ఇంతవరకూ బాగానే ఉంది. పాక్ లో భాగంగా ఉండే బలూచ్ పౌరులకు అండదండలు అందిస్తామని మోడీ చెప్పటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటన్నది ఒక ప్రశ్న. నిజానికి సమాధానంలో ప్రశ్నలోనే ఉందని చెప్పాలి. బలూచిస్థాన్ లో బలూచ్ పౌరులు స్వాతంత్ర్యం కోసం చేస్తున్న ఉద్యమానికి అండగా.. భారత్ తన సైన్యాన్ని పంపితే..? విన్న వెంటనే కరెంటు షాక్ కొట్టినట్లుగా అనిపించొచ్చు. కానీ.. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇదేమీ తప్పు కాదు కూడా.

దూరాన ఉన్న మిత్రుల కోసం.. అపన్న హస్తం అందించే పెద్దన్నగా భారత్ వ్యవహరించటం తప్పేం కాదుగా. అందులోకి మానవ హక్కుల్ని దారుణంగా హననం చేస్తున్న పాక్ కు వ్యతిరేకంగా పావులు కదపటం తప్పేం కాదు కదా. కశ్మీర్ పేరుతో యుద్ధం చేస్తే జరిగే రచ్చ వేరు. కానీ.. బలూచ్ పౌరుల స్వేచ్ఛ కోసం.. వారి హక్కుల హననాన్ని ఆపేందుకు పెద్దన్నలా వ్యవహరిస్తే.. పాక్ సరిహద్దుల్లో భారత్ కు కొత్త మైత్రి లభించటమే కాదు.. దాయాదిని దారుణంగా దెబ్బ తీసే అవకాశం కలుగుతుంది.

అయితే.. ఈ పోరాటం కారణంగా మనకు ఎంతోకొంత నష్టం జరగొచ్చు. నిత్యం కశ్మీర్ ను దొంగచాటుగా రగులుస్తూ చేసే నష్టంతో పోల్చినప్పుడు.. బలూచ్ మిత్రుల కోసం మోడీ చేసే ధర్మపోరాటం కలిగే నష్టం తక్కువే అ వుతుంది. కాకుంటే.. భారత్ లాంటి దేశం దూకుడుగా కాలు దువ్వే అవకాశం చాలా తక్కువ. అయితే.. అదేమీ అసాధ్యమని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంత సహనంగా ఉన్నా.. ఏదో రకంగా.. ఎక్కడో ఒకచోట సూది పెట్టి గుచ్చే దాయాదికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ప్రధాని మోడీ కానీ సీరియస్ గా ఉంటే మాత్రం.. దాయాదికి షాకిచ్చే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు.