ఎన్ ఐఏ ఎంట్రీ!...'డ్రామా' రట్టు కాక తప్పదంతే!

Sat Jan 12 2019 16:12:47 GMT+0530 (IST)

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసు మరికొన్ని రోజుల్లోనే ఓ కొలిక్కి రానుంది. పందెం కోళ్ల కాళ్లకు కట్టే కత్తితో జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా అప్రమత్తంగా ఉన్న జగన్.. ఆ దాడి నుంచి లాఘవంగా తప్పించుకున్నారు. విపక్ష నేత హోదాలో ఉన్న జగన్‌పై జరిగిన దాడిపై అధికార టీడీపీ తనదైన దిగజారుడు శైలిని ప్రదర్శించుకుంది. జగన్ తన అభిమాని చేత పొడిపించుకుని ప్రజల సానుభూతి కోసం చేసిన యత్నంగా ఈ దాడిని అభివర్ణించిన చంద్రబాబు సర్కారు... కేసు దర్యాప్తుపై నానా యాగీ చేసింది. మొక్కుబడిగా ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించేసిన బాబు సర్కారు... కేసును నీరుగార్చే యత్నం చేసింది. అయితే నిందితుడు పనిచేస్తున్న ఎయిర్ పోర్టు కేంటీన్ టీడీపీకి చెందిన కీలక నేతది కావడంతో ఈ దాడి వెనుక కుట్ర ఉందన్న కోణంలో వైసీపీ ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఇదే డిమాండ్ తో జగన్ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు.జగన్ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు... కేసును ఎన్ఐఏకు అప్పగించింది. కోర్టు ఆదేశాలు అందిన వెంటనే రంగంలోకి దిగిపోన ఎన్ఐఏకు చంద్రబాబు సర్కారు రాష్ట్ర పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో లాభం లేదనుకున్న ఎన్ఐఏ కూడా హైకోర్టును ఆశ్రయించి కేసును విశాఖ నుంచి విజయవాడ కోర్టుకు బదిలీ చేయించుకుంది. ఆ వెంటనే విజయవాడ కోర్టులో నిందితుడి కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసి... అందులోనూ విజయం సాధించింది. ఎన్ఐఏ కోరినట్టుగా నిందితుడు శ్రీనివాసరావును వారం పాటు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతిస్తూ నిన్ననే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు... తమ విచారణ కోసం అతడిని హైదరాబాదు తరలించారు. ఈ సాయంత్రానికి హైదరాబాదు చేరుకునే ఎన్ఐఏ అధికారులు... శ్రీనివాసరావును తమదైన శైలిలో విచారించనున్నారు.

రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ ఎదుట తనదైన శైలి సమాధానాలు చెప్పి.. ఈ దాడికి సూత్రధారులుగా వ్యవహరించిన వారి మాటలనే వల్లె వేసిన నిందితుడు... ఎన్ఐఏ విచారణలో మాత్రం అసలు నిజం కక్కక తప్పదన్న వాదన వినిపిస్తోంది. కోర్టు అనుమతించిన వారం రోజుల కస్టడీలోనే ఈ మొత్తం కేసు గుట్టును రట్టు చేసేందుకు ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లుగా సమాచారం. మొత్తంగా శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే షాక్ తిన్న ఈ దాడి సూత్రధారులు... అతడిని ఎన్ ఐఏ అదుపులోకి తీసుకోవడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నట్లుగా సమాచారం. ఎన్ఐఏ వడివడిగా వేస్తున్న అడుగులతో అతి త్వరలోనే ఈ కేసులోని సూత్రధారులు బయటకు రాక తప్పదన్న వాదన కూడా వినిపిస్తోంది.