అమరావతిపై ఎన్జీటీ తీర్పులో ఇంత కథ ఉందా?

Sun Nov 19 2017 21:00:01 GMT+0530 (IST)

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో  సుదీర్ఘ కాలం పాటు వాదనలు కొనసాగాయి. రైతుల ఇంట బంగారు సిరులు నింపే భూములను రాజధాని పేరు చెప్పి టీడీపీ సర్కారు బలవంతంగా లాగేసుకుందని అదే సమయంలో ఏమాత్రం పర్యావరణ ప్రమాణాలు పాటించకుండానే అమరావతి నిర్మాణానికి చంద్రబాబు సర్కారు యత్నాలు చేస్తోందని పలువురు వ్యక్తులు వేర్వేరుగా గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్లకు ఆద్యుడిగా శ్రీమన్నారాయణ అనే వ్యక్తేనని చెప్పాలి. సామాజిక ఉద్యమకారుడిగా రంగంలోకి దిగిన శ్రీమన్నారాయణ... అమరావతి నిర్మాణంపై చంద్రబాబు సర్కారు తనదైన ఒంటెత్తు పోకడలు పోతోందని ఆరోపించడంతో పాటు... నేరుగా గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి బాబు సర్కారుకు నిజంగానే షాకిచ్చారు. శ్రీమన్నారాయణను అనుసరించిన మరికొందరు కూడా ఇదే విషయంపై గ్రీన్ ట్రిబ్యూనల్‌లో వరుసగా పిటిషన్లు వేయగా... వాటిని విచారణకు స్వీకరించిన ట్రిబ్యూనల్... విచారణ పూర్తయ్యే దాకా నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఈ పిటీషన్లంటినీ ఒకే కట్టన కట్టేసి విచారణ చేపట్టింది.ఓ వైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మరోవైపు సర్కారు వకీళ్లు హోరాహోరీగా వాదనలు వినిపించగా... మొత్తం వాదనలన్నింటినీ ఓపిగ్గా విన్న బ్రిట్యూనల్ నిన్న మొన్న సంచలన తీర్పు వెలువరించారు. ట్రిబ్యూనల్ ఆదేశాలను పాటిస్తూ అమరావతి నిర్మాణం కొనసాగాలని ఆ దిశగానే అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సర్కారుకు ట్రిబ్యూనల్ చల్లటి కబురు చెప్పింది. అదే సమయంలో అమరావతి నిర్మాణంలో పలు సలహాలు సూచనలు కూడా చేసింది. సదరు సూచనలను తుంగలో తొక్కడం కుదరదని అవి అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు రెండు కమిటీలను నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు విన్న వెంటనే చంద్రబాబు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక అమరావతి నిర్మాణాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరని పేర్కొన్నారు. అయితే అమరావతి నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పు అంత ఆషామాషీ ఏమీ కాదని ఆ తీర్పును తూచా తప్పకుండా అమలు చేయక తప్పని పరిస్థితులు చంద్రబాబుకు ఎదురు కాక తప్పదని కూడా ఈ కేసుకు శ్రీకారం చుట్టిన శ్రీమన్నారాయణ చెబుతున్నారు.

కాసేపటి క్రితం విజయవాడలో ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణ... తనను పలుకరించిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  గ్రీన్ ట్రిబ్యూలన్ ఇచ్చిన తీర్పుతో పాటు అందులోని లోతును కూడా ఈ సందర్భంగా ఆయన కూలంకషంగానే వివరించారు. వరద ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు వద్దని ట్రిబ్యూనల్ చెప్పిందన్న శ్రీమన్నారాయణ... ఈ నిబంధనతోనే రాజధాని ప్రాంతంలో 25 వేల ఎకరాల పంట భూములకు ముప్పు తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. వరద ప్రాంతంలో నిర్మాణాలు వద్దంటే... ఇప్పటిదాకా చంద్రబాబు సర్కారు రూపొందించిన ప్రణాళికలోని చాలా నిర్మాణాల రూపు రేఖలు మారక తప్పదని కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం బాబు సర్కారు కట్టిన అసెంబ్లీ సెక్రటేరియట్ నిర్మాణాలు కూడా వరద ప్రాంతంలోనే ఉన్నాయని వాటిని తొలగించక తప్పదన్నారు. ఇక కొండవీటి వాగు ప్రవాహ మార్గాన్ని మార్చరాదని ట్రిబ్యూనల్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ట్రిబ్యూనల్ ఆదేశాలను ప్రభుత్వం ఎంతమేరకు అమలు చేస్తుందన్న విషయాన్ని తాము నిశితంగా గమనిస్తామని ఏమాత్రం ఆదేశాల అమలు జరగలేదని తమ దృష్టికి వచ్చినా.. వెంటనే మళ్లీ ట్రిబ్యూలన్‌ను ఆశ్రయిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీమన్నారాయణ వాదన వింటూ ఉంటే... రాజధాని నిర్మాణంలో చంద్రబాబు సర్కారు తాను అనుకున్నట్టుగా ముందుకు సాగే పరిస్థితి లేదని చెప్పాలి.