Begin typing your search above and press return to search.

బాత్రూంలోనే గుండెపోటుతో..జీవ‌చ్చ‌వంలా శ్రీ‌దేవి

By:  Tupaki Desk   |   25 Feb 2018 2:29 PM GMT
బాత్రూంలోనే గుండెపోటుతో..జీవ‌చ్చ‌వంలా శ్రీ‌దేవి
X
దివ్యతార శ్రీదేవి ఇక లేరు. అందాల నటి శ్రీదేవి(54) దుబాయ్‌ లో గుండెపోటుతో శనివారం రాత్రి కన్నుమూశారు. భ‌ర్త బోనీక‌పూర్ బంధువు మోహిత్ మార్వా కుటుంబ సభ్యుల పెళ్లి కోసం కుటుంబంతో కలిసి శ్రీదేవి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనే స‌మంయ‌లోనే శనివారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందారు. శ్రీదేవి బాత్‌ రూంలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అమె అక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు - బంధువులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించిన‌ప్ప‌టికీ అంత లోపే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. బాలీవుడ్ నిర్మాత - హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్‌ ను1996లో శ్రీదేవి వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు.. జాహ్నవి - ఖుషి.

శ్రీదేవి హఠాన్మరణంతో.. సినీ లోకం మూగబోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.తెలుగు - హిందీ - తమిళ - మలయాళ చిత్ర పరిశ్రమలో ఆమె 200లకు పైగా సినిమాల్లో నటించారు. 1963 - ఆగస్టు 13న శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. హీరోయిన్‌ గా శ్రీదేవి తొలి చిత్రాలు.. తెలుగులో పదహారేళ్ల వయసు - హిందీలో సోల్వా సావన్. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచులో కమల్‌ హాసన్ - రజనీకాంత్‌ లతో కలిసి నటించి.. ఆవిడ స్టార్ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుని పలువురి ప్రశంసలు పొందారు. 1975-85 మధ్య కాలంలో తెలుగు - తమిళంలో ఆమె అగ్రస్థాన కథనాయిక స్థానానికి ఎదిగారు. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే మామ్ చిత్రంతో నటించి అందరిని అలరించారు.

తెలుగులో అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగు 85 - తమిళం 72 - మళయాలం 26 - హిందీ 71 సినిమాల్లో నటించి లక్షల సంఖ్యల్లో అభిమానులను సంపాదించుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2013లో శ్రీదేవిని పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. చాందిని - లమ్హే - మిస్టర్ ఇండియా - నాగిన వంటి బ్లాక్‌ బ్లాస్టర్ సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. చివరిసారిగా మామ్ చిత్రంలో నటించారమె. కొండవీటి సింహం - క్షణక్షణం - వేటగాడు - సర్దార్ పాపరాయుడు - బొబ్బిలిపులి - ప్రేమాభిషేకం - జగదేకవీరుడు అతిలోకసుందరి - గోవిందా గోవిందా సినిమాల్లో శ్రీదేవి నటించారు.

ఆమె మ‌ర‌ణ వార్త అభిమానుల మ‌న‌సుల‌ని ఎంత‌గానో గాయ‌ప‌రిచింది. శ్రీదేవిని క‌డ‌సారి చూసేందుకు ముంబైలోని ఆమె ఇంటికి అభిమానులు భారీ ఎత్తున త‌రలి వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో అంధేరిలోని శ్రీదేవి నివాసం వ‌ద్ద ముంబై పోలీసులు భారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేశారు. మ‌రోవైపు యూఏఈలోని భారత రాయబారి నవదీప్‌ సింగ్ శ్రీదేవి భౌతిక దేహాన్ని ముంబైకి త‌ర‌లించే విష‌యంలో అన్ని ర‌కాలుగా స‌హాయ‌ప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు అన్ని పూర్తైన త‌ర్వాత ఈ రోజు మధ్యాహ్నం మూడు గంట‌ల స‌మ‌యంలో శ్రీదేవి భౌతిక కాయం దుబాయ్ నుండి ముంబైకి చార్టర్డ్ ఫ్లైట్‌ లో చేరుకోనుంద‌ని స‌మాచారం. జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రంలోగా ఆమె అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారట‌.