Begin typing your search above and press return to search.

తీరిగ్గా వెళ్లిన త‌మ్ముళ్ల‌ను క‌డిగిపారేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 Oct 2018 6:02 AM GMT
తీరిగ్గా వెళ్లిన త‌మ్ముళ్ల‌ను క‌డిగిపారేస్తున్నారు
X
సీతాకోక చిలుక పేరు పెట్టిన పాడు తిత‌లీ తుఫాను సిక్కోలును ఎంత‌గా అత‌లాకుత‌లం చేసిందో తెలియంది కాదు. మారుమూల‌న ఉన్న వెనుక‌బ‌డిన శ్రీ‌కాకుళం జిల్లా పై ప్ర‌కృతి ప్ర‌కోపాన్ని మీడియా మాత్ర‌మే కాదు.. ఏపీ అధికార‌ప‌క్షం పెద్ద‌గా ప‌ట్టించుకోని తీరుతో సిక్కోలు ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

తుఫాను తీరం దాటి నాలుగైదు రోజులు గ‌డుస్తున్నా.. నేటికీ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌క‌పోవ‌టం.. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌కు తీవ్ర ఇబ్బందుల‌కు గురి కావ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వ ప‌రంగా అందాల్సిన సాయం అంద‌క‌పోవ‌టం.. ఎవ‌రూ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఆవేద‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. దీంతో.. త‌మ‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌స్తున్న తెలుగు త‌మ్ముళ్ల‌ను ఉద్దేశించి.. తీరిగ్గా ప‌రామ‌ర్శించ‌టానికి ఎప్పుడొస్తారా? అంటూ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

తుఫాను కారణంగా రోడ్డున ప‌డిన త‌మ బ‌తుకుల్ని చూసేందుకు ఇప్పుడు తీరుబాటు అయ్యిందా? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. తాజాగా శ్రీ‌కాకుళంలోని తిత‌లీ తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్ని ఏపీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌తో పాటు ప‌లాస ఎమ్మెల్యే గౌతు శ్యామ‌సుంద‌ర శివాజీ అల్లుడు వెంక‌న్న చౌద‌రిని రోడ్ల మీద ప్ర‌జ‌లు నిల‌బెట్టేశారు.

బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వారిని అడ్డుకున్న మ‌హిళ‌లు.. యువ‌కులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేయ‌ట‌మే కాదు.. త‌మ‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన వారిని ఉద్దేశించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయ‌టం గ‌మ‌నార్హం.

తిత‌లీ వ‌చ్చి ఐదు రోజులు అయ్యాక‌.. తీరిగ్గా వ‌స్తారా? తుఫాను కార‌ణంగా మా బ‌తుకులు ఆగ‌మాగ‌మైపోయాయి. ప‌రామ‌ర్శ‌కు ఇప్పుడు వ‌స్తారా? అంటూ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. వారి కోపాన్ని చూసిన మంత్రి అండ్ కోకు నోట మాట రాని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితి ఏ ఒక్క మంత్రికో కాదు.. ఏపీ అధికార ప‌క్షానికి చెందిన నేత‌లు ఎవ‌రు క‌నిపించినా క‌డిగేస్తున్నారు. చాలా చేశామ‌ని చెప్పుకునే చంద్ర‌బాబు.. ప్ర‌జల ఆగ్ర‌హాన్ని గ‌మ‌నిస్తున్నారా?