Begin typing your search above and press return to search.

అధ్య‌క్షుడితో విద్యార్థి హైటెక్ చెల‌గాటం!

By:  Tupaki Desk   |   30 Aug 2016 9:46 AM GMT
అధ్య‌క్షుడితో విద్యార్థి హైటెక్ చెల‌గాటం!
X
ప్ర‌జ‌ల‌కు ఉన్న స‌మ‌స్య‌లు ఎవ‌రికి చెప్పుకుంటారూ... నాయ‌కుల‌కే క‌దండీ! ఎందుకంటే, ఓట్లేసి గెలిపించాం కాబ‌ట్టి, స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు వారికే చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడానికి వినతి ప‌త్రాలు ఇస్తాం... ఇంకా స్పందించ‌క‌పోతే మీడియా ముందుకు వెళ్తాం, మా స‌మ‌స్య‌లు అర్థం చేసుకోండి మ‌హాప్ర‌భో అంటూ రోడ్డెక్కుతాం. కానీ, ఆ శ్రీ‌లంక కుర్రాడు త‌న డిమాండ్ల‌ను తెలిపేందుకు డిఫ‌రెంట్ రూట్ ఎంచుకున్నాడు. అందుకే, చిక్కుల్లో ప‌డ్డాడు!

జేసీయీ అడ్వాన్సుడ్ లెవెల్ ప‌రీక్ష‌ల‌ని వాయిదా వేస్తే బాగుంటుంది అనేది ఆ విద్యార్థి డిమాండ్‌. ఈ విష‌యాన్ని శ్రీ‌లంక అధ్య‌క్షుడి దృష్టికి తీసుకెళ్లేందుకు హైటెక్ మార్గంలో ప్ర‌య‌త్నించాడు! దేశాధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన అధికారిక వెబ్ సైట్ ను కుర్రాడు హ్యాక్ చేసేశాడు. అఫీషియ‌ల్ వెబ్‌ సైట్ ను త‌న నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకుని, ఏకంగా హోమ్ పేజీని మార్చేశాడు. ప్ర‌స్తుతం ఆ పరీక్ష నిర్వ‌హించ‌వ‌ద్ద‌నీ, వీలైతే వాయిదా వేయాలంటే, లేకుండా అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటూ రాజీనామా చేయాల‌ని ఏకంగా అధ్య‌క్షుడికే వార్నింగ్ ఇస్తూ లేఖ రాసి ఆ హోమ్ పేజీలో పెట్టాడు. త‌న డిమాండ్ల‌తో ఆ పేజీ క్రియేట్ చేసి అధ్య‌క్షుడికి క‌నిపించేలా చేశాడు.

దీంతో అధ్య‌క్షుడు సిరిసేన నిర్ఘాంత‌పోయారు. అఫీషియ‌ల్ సైట్ ను ఒక విద్యార్థి హ్యాక్ చేశాడ‌ని తెలుసుకుని అధికారులు రంగంలోకి దిగారు. ఈ హ్యాకింగ్ ఎక్క‌డి నుంచి జ‌రిగింద‌ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే... క‌డుగ‌న్నావ‌లో ఉంటున్న ఆ కుర్రాడు దొరికిపోయాడు. రాజ‌ధాని కొలంబోకి దాదాపు 100 కి.మీ. దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ హైటెక్ విద్యార్థిని సైబ‌ర్ క్రైమ్ యాక్ట్ - 2007 ప్రకారం అరెస్టు చేశాడు. ఈ చట్టం కింద ఒక కుర్రాడిని అరెస్టు చేయ‌డం ఇదే తొలిసారి. అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి, ఏకంగా దేశాధ్య‌క్షుడు వెబ్ సైట్ ను హ్యాక్ చేసిందుకు ఈ విద్యార్థికి గ‌రిష్టంగా మూడేళ్లపాటు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు, రూ. 3 ల‌క్ష‌ల‌కుపైగా జ‌రిమానా కూడా విధించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. చేతిలో టెక్నాల‌జీ ఉంది క‌దా అని.. ఇలాంటి అత్సుత్సాహానికి వెళ్తే ఫ‌లితం ఇలానే ఉంటుంది!